ఉపాధి వేతనం రూ.257 శ్రీఏడాదిలో పెరిగింది రూ.12
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మట్టి పనులతో ప్రభుత్వానికి వేలాది రూపాయల మెటీరియల్ కాంపోనెంటు నిధుల విడుదలకు దోహదపడుతున్న ఉపాధి హామీ పథకం కార్మికులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వేతనాల పెంపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటినా, వేతనాల పెంపు నామమాత్రంగానే ఉంటోంది. ఏడాదికి నాలుగైదు రూపాయలకు మించి పెంచని పరిస్థితి. ఎంత చేసినా నెలకు రూ.5 వేలకు మించి ఆదాయం ఉండదు. నెలకు రూ.10 వేలు ఆదాయం ఉన్న కుటుంబాలకే కుటుంబ పోషణ కష్టంగా ఉంటే, అందులో సగం కూడా లేని ఉపాధి కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం కేంద్రప్రభుత్వం ఉపాధి కార్మికుల వేతనాలను స్వల్పంగా పెంచింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 2021-22లో ఉపాధి వేతనం రూ.245 ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.257కు పెంచనున్నట్లు తెలిపింది. పెంపుదల రూ.12 పెరిగినప్పటికీ, గతేడాది పెంపుతో పోల్చితే రూ.4 పెరిగింది. 2020-21లో వేతనం రూ.237 ఉండగా, 2021-22లో రూ.8 పెంచిన కేంద్రం, 2022-23 నుంచి రూ.12 పెంచుతున్నట్లు ప్రకటించింది. కుటుంబంలో భార్యాభర్తలు ఉపాధి పనికెళ్లినా ఏడాదికి రూ.30 వేలకు మించి ఆదాయం లభించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 100 నుంచి 200 రోజులపాటు పని కల్పించాలని, రూ.600 వేతనం చెల్లించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, కేంద్రం అవేమీ పట్టించుకోకుండా రూ.12 పెంచి చేతులు దులుపుకుంది. రాష్ట్రంలో సుమారు రెండు కోట్ల జాబ్ కార్డులుండగా, కోటి మంది కార్మికులు యాక్టివ్‌గా పని చేస్తున్నారు. వీరికి సగటున రోజుకు రూ.217 వేతనం చెల్లిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా, అది రూ.150కి మించడం లేదు. యాక్టివ్ కార్మికుల్లో 70 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలే ఉండగా, మొత్తమ్మీద మహిళలే 90 శాతం మంది ఉన్నారు. పేదలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో పోరాడి సాధించుకున్న పథకాన్ని కేంద్రం నీరుగార్చేందుకు వేతనాలను పెంచకపోగా, ఉద్దేశపూర్వకంగానే రెండు పూటల పని విధానాన్ని అమలు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. చివరకు ఉపాధి కార్మికుల వేసవి అలవెన్స్‌ను సైతం కేంద్రం ఎత్తివేయడం గమనార్హం.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు
నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయి. కేజీ బియ్యం రూ.45 నుంచి రూ.50 ఉండగా, కేజీ నూనె రూ.200, పప్పు ధర కేజీ రూ.200 పలుకుతోంది. రోజుకు సగటున రూ.150 వేతనంతో నెలకు రూ.5 వేలలోపు ఆదాయం వచ్చే కుటుంబం, భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబాన్ని ఎలా పోషించుకుంటామని కార్మికులు వాపోతున్నారు. విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, కూరగాయల ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. వీటితోపాటు పిల్లల చదువులు, ఆస్పత్రి ఖర్చులు ఇలా అనేకం ఉంటాయి. అన్ని రకాల ధరలూ భారీగా పెంచుతూ, కార్మికులకు అత్యల్పంగా వేతనాలు చెల్లిస్తే ఎట్టా బతకాలని వారు వాపోతున్నారు.
200 రోజులు.. రూ.600 వేతనం
ఉపాధి కార్మికులకు ఏడాదిలో 200 రోజులపాటు పని కల్పించడంతోపాటు రోజువారీ వేతనాన్ని రూ.600 చేయాలి. పొరుగున ఉన్న కేరళలో రూ.311, కర్ణాటకలో రూ.309, తమిళనాడులో రూ.281 ఉంటే, రాష్ట్రంలో మాత్రం రూ.257గానే ఉంది. అత్తెసరు వేతనాలతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోంది. కేంద్రం నిర్ణయించి న రూ.257 ప్రకారం వేతనాల చెల్లింపు జరగదు. ఒకవేళ జరిగినా ఏడాదికి రూ.25 వేలకు మించి ఆదాయం ఉండదు.
- వి.వెంకటేశ్వర్లు,
వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి










