Jun 14,2022 17:57


గన్నవరం వైసిపిలో మూడు ముక్కలాట
వంశీ కేంద్రంగా దుట్టా, యార్లగడ్డ ట్వీట్లు
శివభరత్‌రెడ్డి విమర్శనాస్త్రాలు
ప్రజాశక్తి-గన్నవరం : 
కృష్ణాజిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నా ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక వైసిపిలో ముగ్గురు నేతల మధ్య స్టేట్‌మెంట్లు కాకపుట్టిస్తున్నాయి. గన్నవరం సిట్టింగ్‌ శాసనసభ్యులు డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపి తరపున గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాల మధ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసిపిలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుంచి వంశీ, వైసిపి నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీచేశారు. వంశీ గెలుపొందారు. వంశీ కూడా వైసిపి తీర్థం పుచ్చుకోవటంతో పాత ప్రత్యర్థిత్వం ఇద్దరి మధ్య నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే వంశీ, వైసిపి పొలిటికల్‌ అడ్వయిజర్‌గా ఉన్న డాక్టర్‌ దుట్టా రామచంద్రరావులకు పిలుపు వచ్చింది. అయితే ఆ రోజు అనివార్యకారణాలతో భేటీ వాయిదా పడింది. ఎమ్మెల్యే వంశీ వర్సెస్‌ దుట్టా యార్లగడ్డ, శివభరత్‌రెడ్డి మధ్య మాటలు యుద్ధం రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. గన్నవరం రాజకీయం ఒక్కసారిగా గరం..గరంగా మారిపోయింది. ఒకరి పై ఒకరు కౌంటర్‌ ఎటాక్‌లు ఇస్తూ మాటలు తుటాలు పేల్చుతున్నారు. దుట్టా రామచంద్రరావు , శివభరత్‌ రెడ్డిలు ఎమ్మెల్యే వంశీ పై కౌంటర్‌ ఇవ్వగా అదే మాదిరిగా కొంచెం వాయిస్‌ బేస్‌ పెంచి రాత్రి శివభరత్‌ రెడ్డి, దుట్టా రామచంద్రరావు,యార్లగడ్డ వెంకట్రావులపై విరుచుకుపడ్డారు. రోజుకో కొత్త కొత్త డైలాగులు పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. ట్విస్ట్‌ల పై ట్విస్టులు ఇవ్వటంతో ఎప్పుడు ఏమి జరగుతుందో అని నియోజకవర్గం నాయకుల్లో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.