Jan 10,2023 22:01

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న జిఎల్‌. నరసింహులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనకై ప్రజా సంఘాలు, వామపక్షాలు తలపెట్టిన బస్సు యాత్రను విజయవంత చేద్దామని సిపిఎం, సిపిఐ నాయకులు జిఎల్‌ నరసింహులు, వేమయ్య యాదవ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్జీవో హోంలో విద్యార్థి ,యువజన సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్‌ యం.వేమయ్య, ఎస్కేయూ ప్రొఫెసర్‌ సదాశివరెడ్డి, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కే.శివారెడ్డి, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఆవిషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వెనుకబడిన రాయల సీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు కొత్త రాజధాని అభివృద్ధి కోసం నిధులు, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీల కోసం సమర శంఖారావాన్ని ఈ నెల 20 తేదీ నుండి ఫిబ్రవరి 5 వరకు హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్‌ నరసింహులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జాన్‌ , తెలుగు యువత పార్లమెంట్‌ అధ్యక్షుడు బాబ్జాన్‌, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌, ఎఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజా, కుళ్లాయప్ప, టిడిపి పట్టణ అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంత్‌ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.