Jan 09,2023 21:13

మాట్లాడుతున్న పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : ఈ నెల 23న హిందూపురం నుంచి రాజంపేటకు వచ్చే బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న కోరారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని, రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చేపట్టిన బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంకన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర, నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జగన్‌ విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న అప్పటి బిజెపి ప్రభుత్వం 5 కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని మోసపూరితమైన మాటలు పార్లమెంట్‌లో చెప్పి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు యాత్ర జిల్లాకు వస్తున్న సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు కూడా ఒకటై ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ బస్సు యాత్రలో అన్నమయ్య జిల్లాల నలుమూలల నుండి విద్యార్థులు, యువజనులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు రాజంపేట పట్టణ నాయకులు మన్సూర్‌, ఆసిఫ్‌, సాయి, అబ్బాస్‌, శ్రీను, సాగర్‌, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.