Apr 07,2022 13:31

న్యూఢిల్లీ : బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఇ.. భారత్‌కు వ్యాపించింది. ముంబయిలో తొలి కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. 50 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌ బారిన పడినట్లు భావిస్తున్నారు. ఎక్స్‌ఇ.. ధర్డ్‌ వేవ్‌ కారణమైన ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌. ఎక్స్‌ఇ ఇప్పటి వరకు దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా, ఇప్పుడు తొలి కేసు వెలుగుచూడటంతో ఇప్పుడు దాని వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. కరోనా నుండి కోలుకుంటున్న భారత్‌కు ఈ వైరస్‌ రూపంలో మరో ఉధృతి రానుందా అన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. దేశంలో కొత్త వేరియంట్‌ మొదలైదంటూ ప్రచారం ఊపందుకున్న తరుణంలో న్యూఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ఆ వ్యక్తిలో ఎక్స్‌ఇ వేరియంట్‌ ఉన్నట్లు ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది. కాగా, సదరు బాధితురాలికి సోకిన వేరియంట్‌ ఎక్స్‌ ఇ కాదని ప్రాథమిక విశ్లేషణ సూచించింది. కొన్ని గంటల్లో ఏ వేరియంటో తెలియనుంది.
ఏమిటీ...ఎక్స్‌ఇ వేరియంట్‌ ..?
దేశంలో ధర్డ్‌వేవ్‌లో అత్యధికంగా కరోనా బారిన పడటానికి కారణమైన ఒమిక్రాన్‌.. రెండు ఉప వేరియంట్లను కలిగి ఉంది. బిఎ1, బిఎ2, మూడవది ఉన్నప్పటికీ.. అది ప్రభావితం కాదు. ప్రారంభంలో బిఎ1 వేరియంట్‌ అత్యధికంగా వ్యాప్తి చెందేందుకు కారణమవ్వగా.. భారత్‌లో మాత్రం ధర్డ్‌ వేవ్‌లో ఆధిపత్యం చెలాయించింది బిఎ2నే. బిఎ1 కన్నా బిఎ2 కాస్త వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. కాగా, ఇది ప్రమాదకరమైనది కాదు. ఈ ఎక్స్‌ఇ అనేది రీకాంబినెంట్‌.. ఒమిక్రాన్‌ వేరియంట్లు బిఎ1, బిఎ2 నుండి రూపాంతరం చెందింది. ఎక్స్‌ఇ మొదటి సారిగా జనవరి 19న బ్రిటన్‌లో వెలుగుచూసింది.అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ దేశాల్లో 637 కేసులు వెలుగుచూశాయి. కాగా, ఈ ప్రస్తుత వేరియంట్‌తో పాటు భవిష్యత్తులో మరింత వేగంగా వ్యాప్తిచెందే వేరియంట్‌లు పుట్టవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది.

ఎక్స్‌ఇ అంత ప్రమాదమా..?
కాగా, ఎక్స్‌ఇ ఒమిక్రాన్‌ ఇతర వేరియంట్ల కన్నా భిన్నంగా ఉందని సరైన ఆధారాలు లేవు. ఎక్స్‌ఇ వేరియంట్‌.. బిఎ2 కన్నా దాదాపు 10 శాతం అదనంగా వ్యాప్తిచెందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత మూడు నెలల క్రితం ఎక్స్‌ఇ గుర్తించినప్పటి నుండి ఇప్పటి వరకు కేసులు అధికంగా నమోదు కాలేదు. దీన్ని నిర్ధారణలోకి తీసుకుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా క్లినికల్‌గా కూడా బిఎ1 లేదా బిఎ2కి భిన్నంగా ఈ వైరస్‌ ఉన్నట్లు గుర్తించలేదు. ఒమిక్రాన్‌ వేరియంట్లతో పోలిస్తే.. మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఇప్పటి వరకు ఆధారాలు లేవు. తీవ్రత, వ్యాప్తి, వ్యాధి లక్షణాలు.. వంటి ముఖ్య లక్షణాలను నిర్ధారించేంత వరకు ఇది ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్‌ మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
భారత్‌కు ఈ వైరస్‌ వ్యాపిస్తుందా..?
భారత్‌లో ఈ వేరియంట్‌ వెలుగుచూడటంలో ఆశ్చర్యమేమీ పడనక్కర్లేదు. ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా డోర్లు తెరుస్తుండటంతో వేరియంట్‌ రావచ్చు. ఇది కూడా ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ కాబట్టి.. ఇతర వేరియంట్ల మాదిరిగానే అభివృద్ధి చెందవచ్చు. ఇప్పటికే దేశంలోకి వచ్చి ఉండవచ్చు.. అయితే ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఎక్స్‌ఇని గుర్తించడం ఒక్కటే మార్గం కాదు.. తీవ్రత, లక్షణాలు, వ్యాప్తి, ఇతర అంశాలను గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతమైతే కేసులు ఇంకా నిర్ధారించాల్సి ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే భారత్‌లో ఊపిరి పీల్చుకోవచ్చునుకుంటే.. పప్పులో కాలు వేసినట్లే. వాస్తవమేమీటంటే.. వైరస్‌ ఉపరివర్తనాలు దేశంలో అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి మరో ఉధృతి వచ్చినా విస్మయం చెందనక్కర్లేదు. అయితే కొత్త వేరియంట్‌ రూపాంతరం చెందకపోతే.. ఇదే ప్రభావితం చేయవచ్చు.