Aug 04,2021 06:32

    పెగాసస్‌పై దాదాపు రెండు వారాలుగా పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రయత్నించాల్సింది పోయి ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం మోడీ ప్రభుత్వ బరితెగింపును తెలియజేస్తున్నది. పార్లమెంటులో ప్రతిపక్షాల తీరు ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను అవమానపరిచేదిగా ఉందని బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నిందించడం గురివింద గింజ సామెతను గుర్తు చేస్తున్నది. పార్లమెంటుకు జవాబుదారీ వహించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను గాలికొదిలేసి, ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటే ప్రజలు మెచ్చరు. పెగాసస్‌ స్పైవేర్‌ అనే సైబర్‌ ఆయుధాన్ని సర్కార్‌ తన సొంత పౌరులపైనే ప్రయోగించిందన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసే ఇటువంటి చర్యను ఏ ప్రజాస్వామ్య దేశమూ అనుమతించదు. పెగాసస్‌ వ్యవహారంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఐ.టి, హోమ్‌, కమ్యూనికేషన్స్‌ శాఖ అధికారులను విచారించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వం వారిని వెళ్లనీయకుండా అడ్డుకోవడం పార్లమెంటును అగౌరవ పరచడమే. పెగాసస్‌ స్పైవేర్‌ను ఇజ్రాయిలీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ నుంచి కొన్నారా, లేదా? ఇందుకు వందలాది కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించారా, లేదా? సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు అడిగితే అది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు ఎలా అవుతుందో ఏలికలే సెలవివ్వాలి. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఈ డేటా విశ్వసనీయతను నిర్ధారించిన ఆమ్నెస్టీీ టెక్‌ లాబ్‌, టొరంటో యూనివర్సిటీ లాబ్‌లను తప్పు పడుతున్నది. భారత దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన విదేశీ కుట్ర అన్న థియరీని ముందుకు తెస్తున్నది.పెగాసస్‌ వ్యవహారం బయటకు రాగానే ఫ్రాన్స్‌, మెక్సికో వంటి చాలా దేశాలు స్పందించి వెంటనే దర్యాప్తునకు ఆదేశించాయి. మన దేశంలోనూ దీనిపై ఉన్నత స్థాయి న్యాయవిచారణకు ప్రతిపక్ష నేతలతోబాటు ఎన్‌డిఏలో భాగస్వాములుగా ఉన్న నితీష్‌ కుమార్‌ (జె.డి-యు), జీతన్‌ రామ్‌ మాంఝీ (హిందుస్తాన్‌ అవామ్‌ మోర్చా) వంటి వారు సైతం గొంతెత్తారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నా మోడీ సర్కార్‌ ఖాతరు చేయడం లేదు. ప్రజల పట్ల, పార్లమెంటు పట్ల ప్రభుత్వ ధిక్కార ధోరణిని ఇది తెలియజేస్తున్నది. పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను, గోప్యతా హక్కును హరించి వేసిన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, రువాండా, మొరాకో, అజర్‌బైజాన్‌, వంటి మితవాద, నిరంకుశ దేశాల సరసన భారత్‌ కూడా చేరింది. దేశ ప్రతిష్టను దిగజార్చే ఈ చర్యకు మోడీ ప్రభుత్వానిదే బాధ్యత. పార్లమెంటులో గందరగోళ పరిస్థితుల మధ్య జిఐసి ప్రైవేటీకరణ, రక్షణ రంగంలో అత్యవసర సర్వీస్‌ చట్టం, వంటి పలు ప్రజా వ్యతిరేక బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకుంది. పార్లమెంటరీ ప్రక్రియను, రాజ్యాంగ సంస్థలను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తూ మరో వైపు ప్రజాస్వామ్యం, ప్రజలు గురించి మాట్లాడడం మోడీ ప్రభుత్వ నయవంచనకు పరాకాష్ట. కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ దారుణ వైఫల్యం, కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు ఎనిమిది మాసాలకు పైగా సాగిస్తున్న ఉద్యమం, పైపైకి ఎగబాకుతున్న పెట్రో ధరలు, విశ్వ రూపం దాల్చుతున్న నిరుద్యోగం, రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు వంటి ముఖ్యమైన సమస్యలు పార్లమెంటులో చర్చకు రాకుండా పోవడానికి ప్రభుత్వ బాధ్యతారహిత వైఖరే కారణం. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి. మరో తొమ్మిది రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ప్రతిష్టంభన తొలగాలంటే ప్రజల హక్కులకు సంబంధించిన ఎంతో ముఖ్యమైన పెగాసస్‌ వ్యవహారంపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధపడాలి. ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడమో చేయాలి. అందుకు ప్రభుత్వం దిగిరాకుంటే మెడలు వంచైనా సాధించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలవడం ఆహ్వానించదగిన పరిణామం. పెగాసస్‌పై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని ఇప్పటికే పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టనున్నది. మోడీ ప్రభుత్వం అనవసర ప్రతిష్టకు పోకుండా పెగాసస్‌ వ్యవహారంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణకు ఆదేశించాలి. తద్వారా ఈ ప్రతిష్టంభనకు తెర దించాలి.