పెగాసస్ స్పైవేర్‌తో రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వెలువరించిన ఆదేశాలు మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఇన్నాళ్లూ పెగాసస్ నిఘా ప్రతిపక్షాల అభూత కల్పనగా పేర్కొంటూ తప్పించుకు తిరుగుతున్న బిజెపి సర్కారు పరిస్థితి సుప్రీం కోర్టు చర్యతో కుడితిలో పడ్డ ఎలుక బాపతైంది. ఫోన్లపై నిఘా పౌరుల వ్యక్తిగత గోప్యత, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగంగా పేర్కొంటూ ప్రముఖ జర్నలిస్టు ఎన్. రామ్, మరి కొందరు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం రిటైర్డ్ జస్టిస్ పర్యవేక్షణలో నిపుణుల త్రిసభ్య కమిటీని నియమించింది. తన 46 పేజీల మధ్యంతర ఉత్తర్వుల్లో 'సుప్రీం' పేర్కొన్న అంశాలు బిజెపి సర్కారు వైఖరిని తీవ్రంగా ఎండగట్టేవే. కొన్ని మాసాల కోర్టు విచారణలో కేంద్రం తన విధానంపై స్పష్టత ఇవ్వకపోగా, ఆరోపణలను తోసిపుచ్చింది. జాతీయ భద్రత ముడిపడి ఉన్నందున వివరాలు వెల్లడించలేమని పొడి పొడిగా అఫిడవిట్లు ఇచ్చింది. ఈ విషయాన్ని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మోడీ ప్రభుత్వం దోషి అనడానికి ఇంతకంటే ఏం కావాలి? జాతీయ భద్రత పేరుతో అన్ని సార్లూ కోర్టు పరిశీలన నుండి తప్పించుకోవడం కుదరదని సుప్రీం చేసిన ఆక్షేపణతో సర్కారు నక్కజిత్తులు బయట పడ్డాయి.
ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ గ్రూపు రూపొందించిన పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్ల టాపింగ్ జరిగిందని, మన దేశంలో పెగాసస్ నిఘా కింద 300 మందికి పైగా ఉన్నారని మొన్న జులైలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు వెలువడిన మీడియా కథనాలు ప్రకంపనలు రేపాయి. యావత్ ప్రతిపక్షం నిలదీయగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు సరికదా ఎదురుదాడి చేసింది. దర్యాప్తునకు నిరాకరించింది. ప్రభుత్వమే పార్లమెంట్ సమావేశాలను జరగనీకుండా చేసింది. పార్లమెంట్‌లో తప్పించుకున్నామని మోడీ సర్కారు సంబర పడుతుండగా, సుప్రీం ఆదేశాలతో బోనులో నిలబడాల్సి వచ్చింది. పెగాసస్ స్పైవేర్‌ను తయారు చేసిన ఎన్‌ఎస్‌ఒ తమ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వ సంస్థలకే విక్రయించామని ఎప్పుడో విస్పష్టంగా ప్రకటించింది. ఆ ప్రకారం మన దేశంలో పౌరులపై నిఘాకు ప్రభుత్వమే పాల్పడిందని తెలుస్తూనే ఉంది. కనుక బిజెపి ప్రభుత్వం తప్పించుకునే ఆస్కారమే లేదు. అందుకే ఎక్కడ తమ బండారం బయట పడుతుందోననన్న భయంతో పార్లమెంట్‌ను హైజాక్ చేసింది. ప్రతిపక్షాలను బుకాయించింది. చివరికి న్యాయస్థానానికి సైతం వివరాలు ఇవ్వకుండా దాచిపెట్టింది.
పెగాసస్ బారిన పడ్డ దేశాలలో ప్రభుత్వాలు విచారణకు ఆదేశించగా మోడీ సర్కారు మాత్రం ముందుకు రాలేదు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలోనూ ఇలాగే వ్యవహరించింది. అప్పుడూ జాతి భద్రత పేరు చెప్పి కోర్టులో తప్పించుకుంది. ఒక వైపు రక్షణ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను ఆహ్వానిస్తూ, మరో వైపు కుంభకోణాలు, పౌరులపై చట్ట వ్యతిరేక నిఘా ఆరోపణలపై మాత్రం జాతి భద్రత పేరు చెప్పి తప్పించుకోవడం బిజెపి నీతి బాహ్యానికి పరాకాష్ట. పండోరా, పనామా పత్రాలపై సైతం దర్యాప్తు జరిపితే మోడీ సర్కారు, దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అక్రమ అపర కుబేరుల జాతకాలు బయట పడతాయి. కొత్తగా కేంద్రం తెచ్చిన ఐ.టి రూల్స్ సైతం పౌరుల స్వేచ్ఛను హరించేవే. మోడీ సర్కారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ నిరంకుశ పాలన సాగిస్తున్న వేళ పెగాసస్ అక్రమ వాడకంపై సుప్రీం దర్యాప్తు కమిటీని వేయడం ఆహ్వానించదగిన పరిణామం. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ వ్యవహారం అయినందున విదేశీ నిపుణుల సహాయం తీసుకుంటేనే సమగ్ర దర్యాప్తు సాకారమవుతుంది. రాజ్యాంగం పౌరులకు వ్యక్తిగత గోప్యత, భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించిందని, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి ప్రభుత్వం చట్టబద్ధ పాలన చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయంతోనైనా మోడీ సర్కారు తన తీరు మార్చుకోవాలి. ఇప్పటికైనా పెగాసస్‌పై ప్రజలకు సమాధానం చెప్పాలి.










