May 31,2023 21:07

బోగస్‌ భాగోతంపై విచారణేది?

కడప ప్రతినిధి : వైద్య ఆరోగ్య శాఖ బోగస్‌ బాగోతం విచారణపై నిర్లక్ష్యం రాజ్య మేలుతోంది. 2022 నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో చేపట్టిన 291 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీలో సర్టిఫికెట్ల పరిశీలన వ్యవహారం సక్రమంగా చేపట్టకపోవడంతో సుమారు 21 మంది అనర్హులకు ఉద్యోగాలు లభించడంపై అప్పట్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా పూతలపట్టు ప్రాంతానికి చెందిన ఓ స్టాఫ్‌నర్స్‌ నియామకం విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యపు ఉదంతానికి సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్‌ వేటుపడింది. ఆయనపై అప్పట్లో పోలీస్‌ కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిజానిజాలను విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సుమారు ఆర్నెళ్లుగా పోలీస్‌, డిపార్టుమెంట్‌ విచారణల్లో ఎటువంటి కదలిక లేకపోవడంతో సస్పెన్షన్‌లోనే మగ్గుతున్నట్లు సమాచారం. విచారణ కమిటీలో సస్పెన్షన్‌ చేసిన పూర్వ ఆర్‌డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డిప్యూటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు సంయుక్తంగా విచారణ చేపట్టాల్సి ఉంది. ఎస్‌ఆర్‌ రిమార్క్స్‌ పరిశీలన, ఇతర శాఖాపరమైన క్రమశిక్షణ తదితర రిమార్క్స్‌ను పరిశీలన చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు గతంలో పనిచేసిన ప్రదేశంలో గాకుండా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. విచారణే చేపట్టని నేపథ్యంలో బోగస్‌ బాగోతంపై విచారణలో ఎప్పటికి కదలిక వస్తుందో తెలియడం లేదు.
విచారణ చేపట్టాం
ఆర్‌డి సూప రింటెం డెంట్‌పై విచారణ చేపట్టాం. పూర్వ ఆర్‌డి డాక్టర్‌ కోటేశ్వరి చెన్న్తెలో ఉన్న కారణంగా హాజరు కాలేనని తెలిపారు ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డిప్యూటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధికారులు విచారణ చేప ట్టారు. విచారణ అనంతరం ఇచ్చే రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేస్తాం.
- డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ఆర్‌డి, కడప.