- రెడ్ జోన్‌లో జెన్‌కో
- ఆందోళనలో ఇంధనశాఖ అధికారులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత వేధిస్తోంది. అందుబాటులో ఉన్న బొగ్గు కేవలం రోజులకే అందుబాటులో ఉండడంతో ఆ ప్లాంట్లు మనుగడ కొనసాగించడమే కష్టంగా మారుతోంది.. తాజాగా ఇవే అంశాలపై ఇంధన శాఖ ఉన్నతస్ధాయి సమావేశంలో చర్చించింది. విద్యుత్ అథారిటీ విధానాల మేరకు బొగ్గు నిల్వల ఆధారంగా మూడు విభాగాలుగా గుర్తించారు. ముందు నెలకన్నా 64 శాతం తక్కువ నిల్వ ఉండే ప్లాంట్లను రెడ్ జోన్‌గా, 65 నుంచి 85 శాతం మధ్య నిల్వ ఉన్న ప్లాంట్లను ఎల్లో జోన్‌గా, 85 శాతం కన్నా ఎక్కువ బొగ్గు నిల్వ అందుబాటులో ఉంటే గ్రీన్ జోన్‌గా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నార్లతాతారావు ప్లాంట్, రాయలసీమ ప్లాంట్లు పూర్తిగా రెడ్ జోన్‌లో ఉన్నట్లు తేలింది. ఈ నెల 26వ తేదీ నాటికి ఎన్‌టిటిపిఎస్‌లో 1.59 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ మాత్రమే ఉండగా, ఆర్‌టిపిపిలో అతి తక్కువగా 24,588 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. దీనివల్ల మొత్తం జెన్‌కో రెడ్ జోన్‌లో ఉన్నట్లు ఆ శాఖ అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. బొగ్గు నిల్వలు తక్కువగా ఉండి, రెడ్ జోన్‌లో ఉన్న ప్లాంట్లకు ముందుగా బొగ్గు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రెండు ప్లాంట్లకు 11 రేక్‌ల బొగ్గు, అత్యవసర నిల్వ కోసం మరో మూడు రేక్‌ల బొగ్గు కావాల్సి ఉంటుందని బొగ్గు సరఫరా చేసే మహానది కోల్ లిమిటెడ్‌కు లేఖలు రాసారు. ఇదే సమయంలో కేంద్ర ఆధీనంలోని కోర్ మేనేజ్‌మెంట్ టీమ్, సబ్ గ్రూప్ కూడా 10 రేక్‌లతోపాటు, అదనంగా రెండు రేక్‌లు ఇవ్వాలని ఎంసిఎల్‌కు సూచించాయి. అయితే ఎంసిఎల్ మాత్రం కేవలం ఏడు, ఎనిమిది రేక్‌లు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కనీసంగా ఐదు రేక్‌లు తక్కువగా వస్తున్నాయని, అందుకే బొగ్గు సమస్య తీవ్రంగా ఉందని వారంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు సబ గ్రూప్, కోర్ మేనేజ్‌మెంట్ టీమ్‌ల దృష్టికి తీసుకువచ్చాయి. అయినప్పటికీ ఫలితం కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










