''సారూ ఇలా రోజుకో ప్రభుత్వ సంస్థను అమ్మేస్తుంటే మనకొచ్చే ఆదాయం తగ్గిపోతుంది సారూ. బంగారు బాతు గుడ్డులా వాటి నుండి మనకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అదీగాక ప్రతి సందర్భంలోనూ ఆ ప్రభుత్వ సంస్థలే మనల్ని ఆదుకుంటున్నరు సార్. ఆప్‌కో సంఝానా బహుత్ ముష్కిల్ హై సాబ్!!''
''అరే, ముష్కిల్ గురించి మాతో మాట్లాడుతారా, అధికారంలోకి రావడం ఎంత కష్టమో తెలుసా? ఎలాగో వచ్చాం. మన దోస్తులు ఎంత మంది సహాయం చేస్తే ఇక్కడ కూచున్నాం చెప్పండి. అందుకే వాళ్ళ రుణం తీర్చుకోవాలె''.
''బి.ఎస్.ఎన్.ఎల్, విమాన సంస్థలు, పెట్రోలు సంస్థలు, బీమా, ఉక్కు, బ్యాంకులు ఇలా ఒక్కొక్కటీ అమ్మేస్తే మనకు మిగిలేదేముంటుంది సారూ. ఇప్పటికే ప్రజలందరూ మనల్ని తిడుతున్నారు. ఒక పక్క రైతుల పోరాటం తొమ్మిది నెల్లు అయిపోయింది. మొండిగా ఉన్నారని మీ పైన నిందలొస్తున్నారు''.
''అరే భారు, నిందల్కీ భయపడదు మా జోడీ. రైతుల్ మాకీ భయపెడ్తార్? తమాషా మాటల్ మాకు చెప్పొద్దు''
''తమాషా మాటలు కాదు సారూ. సోషల్ మీడియాలో మిమ్మల్ని తిట్టని తిట్టు లేదు. ఇది అంత మంచిది కాదని చరిత్ర చెబుతోంది''
''అరే, ఇతిహాస్ గురించి మాకు చెప్పొద్దు, అది మార్చడానికే మేమొచ్చాం. ఇక సోషల్ మీడియాలో మనకంటే, మన మనుషులకంటే తెలిసినోళ్ళు ఎవరున్నారు చెప్పు. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. వదిలేయండి. చరిత్రను వేరే రూపంలో చూపడంలో వాళ్ళు దిట్టలు. పరమ మేధావులు వాళ్ళు''.
''సామాన్య ప్రజల్లో, ఉద్యోగుల్లో మీపైన వ్యతిరేకత బాగా పెరుగుతోంది సారూ''
''పెరగనీ భారు పెరగనీ....''
''పెరుగుట విరుగుట కొరకే అని కూడా ఉంది సారూ''
''అరే తుమ్‌కో కైసే సంఝానా''
''ఇక మీ ఇష్టం, మళ్ళీ చెప్పలేదనకూడదు''
''నహీ బోలేంగే, అరే భారు నిజంగా మంచి కథ గుర్తు చేసినావ్... అన్ని గుడ్లూ ఒకేసారి అమ్మేస్తాం... ఏ హమారా దోస్తోంకో ఏక్ నజరానా..... నిజం మా స్నేహితులకు ఇదో బహుమతి.... అచ్ఛీ తోఫా....''
ఒక నెల లోపల అన్ని సంస్థలనూ అమ్మేస్తారు జోడీలు. విత్త మంత్రి జానకమ్మ వచ్చీ రాని అర్థశాస్త్ర మాటలతో బిల్లులు ప్రవేశ పెడుతుంటుంది. అది పూర్తి వినకుండానే సభలో మీకు ఆమోదమేనా అని అడగడం అల్లర్ల మధ్య ఆమోదం పొందింది అనడం జరిగిపోయాయి.
షషష
ఎన్నికల వేడి. జోడీలు కండువాలు కప్పుకొని, మంచి ఖరీదైన అద్దాలు పెట్టుకొని, గాజు కళ్ళలాంటి కళ్ళతో మొహంలో ఎటువంటి ఫీలింగూ కనబడకుండా దేశమంతా ప్రచారం మొదలెడతారు. విమానాలు, హెలికాప్టర్లలో దేశం మొత్తం చుట్టేస్తారు. ఎక్కడ చూసినా పలుచగా జనం. ఇది కాదని తమ మనుషులనే నింపేస్తారు సభల నిండా. మొత్తం మీడియా ఎప్పటిలాగానే మళ్ళీ జోడీదే అధికారం అని రాస్తే, బోల్తా కొట్టనున్న జోడీలు అని ఇంకొన్ని పత్రికలు రాస్తాయి.
ఫలితాల రోజు వస్తుంది. ఎటూ మొదట తాము గెలిచినవే అదీ అతి తక్కువ మెజారిటీతో, చూపిస్తారు. తరువాత ఒక్కొక్కటీ ఇతర పక్షాలకు, అనూహ్యంగా అరుణ సోదరులకూ సీట్లొస్తుంటాయి. ఇది చూసి జోడీలు కంగారు పడతారు.
''ఏ క్యా హై జోడీజీ, ఐసా హువా.....?''
''అదే చూస్తున్నా సీనియర్ జోడీజీ.... మన మిత్రుడు జుంబానీ, జంబానీ కూడా ఫోన్ చేయడంలేదు. సర్వేలనీ మన వైపే ఉన్నాయి. వాటికిచ్చిన డబ్బులూ వృధా పాయె. ఏ కైసా హువా జోడీజీ...''
ఇంతలో అంతకు ముందు మంచి మాటలు చెప్పిన శ్రేయోభిలాషి ఇద్దరికీ టీ తెస్తాడు. 'నేను చెప్పినప్పుడు వినలేదు సారూ...' అన్నాడు పెద్ద జోడీజీ చెవిలో.
''టీ ఎందుకు చేదుగా ఉంది'' ఇద్దరూ ఒకేసారి అంటారు.
''ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు అలాగే అంటారని నాకు తెలుసు సాబ్. మధ్యాహ్నానికి పుల్కా, బాతు గుడ్డు ఆమ్లెట్ చేయమంటారా సాబ్?''
''బాతు గుడ్డూ.... ఎప్పుడో చెప్పినట్టున్నావ్ కదా, యాదొస్తోంది''
''చెప్పినాను సారూ. మీరు వినలేదు. ఇంక బాతు గుడ్ల వ్యాపారం పెట్టుకోండి, మీకు బాగుంటుంది''
''ఏ భారు ఇది నిజం కాదు, కల.... నాకిప్పుడు మెలకువ వస్తుంది చూడు, నా కలవరింతలు విని నా మొహం మీద నీళ్ళు చల్లుతారు చూడు''
''లేదు సాబ్ ఇది నిజం, మీరు మెలకువ లోనే ఉన్నారు. కాస్త చేయి గిల్లుత చూడండి'' అని గిల్లుతాడు.
''నాకేమీ కాలేదే? ఇది కలే చెప్పానుగా''
''మీ తోలు కాస్త మందం అందుకే నొప్పి తెలియడం లేదు. ప్రజలకు బాగా తెలిసినట్టుంది''
''నిజమా? అవునేమో!! ఈపాటికే మన ఇంటి ముందు నిండుగా కార్లు రావాలే?''
''ఇంకెక్కడి కార్లు సారూ. పెట్రోలు, డీజిలు రెండు వందలకు దగ్గరగా ఉంది. చెబితే విన్నారా రోజుకో బాతు గుడ్డు కోయండని, ఇటు ప్రజలూ, అటు ఇద్దరు మిత్రులూ దూరమయ్యారు''
''బంగారు బాతుగుడ్డు కథ మరొక్కసారి చెప్పు వింటా''
''ఎన్నిసార్లు విన్నా మీకర్థం కాదులెండి...''
/ సెల్ : 9849753298 /
జంధ్యాల రఘుబాబు











