Jul 11,2021 21:44
తూర్పుగోదావరి జిల్లా పెద్దభీంపల్లిలో చప్టాపైనుంచి ప్రవహిస్తున్న నీరు

* సముద్రంలోకి వెళ్లద్దంటూ మత్స్యకారులకు హెచ్చరిక
ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఉత్తర ఆంధ్రప్రదేశ్‌-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 48 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తీరంలోని సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలున్నాయని, మరో నాలుగు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లద్దంటూ రాష్ట్ర వాతావరణ కేంద్రంతో పాటు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కంట్రోల్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి మోనిటరింగ్‌ చేయాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. విశాఖలో లోతట్టు ప్రాంతాల పట్ల రెవెన్యూ, జివిఎంసి అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం, గుంటూరు,పశ్చిమగోదావరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పెద్దభీంపల్లిా2 కాలనీ సమీపంలో చెరువు వద్ద ఏర్పాటు చేసిన చప్టాపై నుంచి నీరు పొంగి ప్రవహిస్తుంది. గోకవరం నుంచి ఇందుకూరు పేటకు వెళ్లే ప్రధానమార్గంలో ఈ చప్టా ఉండటంతో 35 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సామర్లకోటలో కురిసిన భారీ వర్షానికి బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, మెహర్‌ కాంప్లెక్స్‌, డైలీ మార్కెట్‌ రోడ్డులో మోకాల్లోతు వర్షపు నీరు నిలిచింది.