Apr 11,2022 07:40
  • ప్రజాపంథాతో విప్లవ పార్టీ నిర్మాణం దిశగా సాగుదాం
  • బిజెపి చెర నుంచి దేశాన్ని కాపాడుకుందాం
  • కన్నూరులో దిగ్విజయంగా ముగిసిన సిపిఎం 23వ మహాసభ ఉద్ఘాటన

కన్నూర్‌ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : బలమైన శక్తిగా ముందుకు సాగాలని సిపిఐ(ఎం) 23వ మహాసభ సంకల్పించింది. ఈ నెల 6 నుంచి ఐదు రోజుల పాటు దిగ్విజయంగా సాగిన మహాసభ ముగింపు సందర్భంగా ఆదివారం కన్నూరులో బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. బలమైన శక్తిగా ఎదగాలంటే ప్రజాపంథాతో కూడిన విప్లవ పార్టీ నిర్మాణం అత్యంత అవశ్యకమని మహాసభ తీర్మానించింది. బిజెపి చెర నుంచి దేశాన్ని కాపాడేందుకు రెట్టించిన పట్టుదలతో పోరాటమే మార్గమని స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. మోడీ ప్రభుత్వం ప్రజల జీవితాలపైన, ప్రజాతంత్ర హక్కులపైన సాగిస్తున్న దుర్మార్గమైన దాడులను తిప్పికొట్టేందుకు రాజీలేని పోరు సాగించాలని నొక్కి చెప్పింది. రాజ్యాంగ మౌలిక విలువలైన లౌకికవాదం, ప్రజాస్వామ్యంపై బిజెపి సాగిస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది.