- డాక్టర్ శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీలో అరుదైన చికిత్స
ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: కిడ్నీలు దెబ్బతినడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాలికకు డాక్టర్ శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ వైద్యులు పునర్జీవితం అందించారు. సూర్యారావుపేటలోని శరత్ ఇనిస్టిట్యూట్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేవంలో డాక్టర్ జి.శరత్‌బాబు చికిత్సకు సంబంధించిన వివరాలను తెలిపారు. మూత్రపిండాలు పూర్తిగా పాడైన స్థితిలో 14 ఏళ్ల బాలికను శరత్ ఇనిస్టిట్యూట్‌కు తీసుకొచ్చారన్నారు. డయాలసిస్ లేకుండా ప్రీఎంప్టివ్ కిడ్నీ ట్రాన్స్‌ప్ల్లంటేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు తెలిపారు. బాలిక అమ్మమ్మ కిడ్నీ దానం చేసేందుకు ముందుకువచ్చారన్నారు. కిడ్నీ దాతది 'బి' బ్లడ్‌గ్రూప్ అయినప్పటికీ, అనేక ముందస్తు చికిత్సల అనంతరం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కిడ్నీ మార్పిడి చికిత్సల్లో విశేషానుభవం కలిగిన శరత్‌బాబు ఇన్కంపేటబుల్ విధానం ద్వారా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను పూర్తి చేశారు. రోగికి ముందుగా ఇమ్యునోఅడ్సాప్ష్రన్ పద్ధతిలో బి గ్రూపు యాంటీబాడీలను 1:4 స్థాయికి నియంత్రించగలిగి, యాంటీబాడీలు సురక్షిత స్థితికి చేరిన అనంతరం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. సాధారణ కిడ్నీ మార్పిడి చికిత్సలతో పోల్చితే, ఈ తరహా కేసుల్లో రిస్క్ అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. 'ఒ' బ్లడ్ గ్రూపు వారిలో 'బి' గ్రూపు యాంటీబాడీలను నియంత్రించకుండా కిడ్నీ మార్పిడి చేసినట్లయితే, కిడ్నీ తిరస్కరణకు గురై ఆపరేషన్ టేబుల్‌పైనే రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. తమ హాస్పిటల్లో ఇప్పటివరకు వందలాది కిడ్నీ మార్పిడి చికిత్సలను నిర్వహించామని, వేర్వేరు గ్రూపులున్న వారికి కిడ్నీ మార్పిడి చేయడం ఇది ఆరోసారని అన్నారు. దాత, గ్రహీతలు బ్లడ్ గ్రూపులు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎబిఒ ఇన్కంపేటబుల్ విధానంలో కిడ్నీ మార్పిడి సాధ్యమేనని తెలిపారు. శరత్ ఇనిస్టిట్యూట్లోని అత్యాధునిక నెఫ్రాలజీ, యురాలజీ విభాగాల ద్వారా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో శరత్ ఇనిస్టిట్యూట్ ఎండి వెంకట్రావు, రేడియాలజిస్ట్ డాక్టర్ ప్రశాంతి, యురాలజిస్ట్ డాక్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










