ఓబుళదేవరచెరువు : పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యం, రాగుల తూకంలో మోసం చేస్తున్న ఎండిఎం వాహనదారున్ని ఓ వాలంటీర్ ప్రశ్నించాడు. దీంతో కోపోద్రుక్తుడైన రేషన్ షాపు డీలర్ తన అనుచురులతో ఆ వాలంటీర్‌ను చితకబాదాడు. దీంతో వాలంటీర్ తీవ్ర గాయాలతో కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓబుళదేవచెరువు మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి బాధితుడు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... ఓబుళచెరువు మండల కేంద్రంలో అబ్దుల్ జబ్బార్ అనే బియ్యం రవాణా వాహనదారుడు సంబంధిత ప్రాంతంలో పేదలకు బియ్యం, రాగులు పంపిణీ చేస్తున్నాడు. బియ్యం తూకం సమయంలో ఒక కేజీ రాయిని స్కేల్ పక్కనబెట్టి తూకం వేస్తున్న విషయాన్ని వాలంటీర్ ఇర్ఫాన్ గమనించి దీనిని ప్రశ్నించాడు. ఇదే విధంగా రాగులు తూకంలో మూడు కిలోల రాళ్ల స్థానంలో నీటి మోటర్ ఉపయోగించే రెండు కిలోల ఇనుప దిమ్మె పెట్టి తూకం వేస్తున్న విషయాన్ని ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జబ్బర్‌తో అతని సమీప బంధువులు నలుగురు వాలంటీర్ ఇర్ఫాన్‌ను ఇనుపరాడ్లతో చితకబాదారు. తీవ్ర గాయాలకు గురైన ఇర్ఫాన్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన కదిరి ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో వీడియో తీస్తున్న వారి సెల్‌ఫోన్లను లాక్కొన్నారని, తనజేబులో ఉన్న రూ.పదివేల నగదునూ లాక్కున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితుడు గురువారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తూకంలో మోసం చేస్తూ, దానిని ప్రశ్నించిన వాలంటీర్‌పై దాడి చేసిన బియ్యం రవాణా దారుడు జబ్బర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.










