Mar 14,2023 21:04

సమావేశంలో మాట్లాడుతున్న నారా లోకేష్‌

పాదయాత్రలో నారా లోకేష్‌
ప్రజాశక్తి-బి.కొత్తకోట : బిసిల రక్షణ కోసం ప్రత్యేకంగా బిసి రక్షణ చట్టం తీసుకొస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పేరుతో లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. మంగళవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటలోని కంటేవారిపల్లె నుంచి ప్రారంభమైన పాదయాత్ర బి.కొత్తకోట మండలంలోని కండ్లమడుగు క్రాస్‌, హార్సిలీహిల్స్‌ క్రాస్‌, మద్దయ్యప్పగారిపల్లె, మొగసాలమర్రి, కుమ్మరపల్లి, నాయనిబావి పంచాయతీ పరిధిలోని గుట్టపాలెం విడిది కేంద్రం వరకు పాదయాత్ర సాగుతుంది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, బిసి సామాజిక వర్గీయులు, మహిళలు, డెయిరీ రైతులతో మాటామంతి, ముఖాముఖి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దమడ్యం మండలంలోని ప్రజలతో మద్దయ్యప్పగారిపల్లె వద్ద భేటీ అయ్యారు. పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల లోకేష్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బిసిలను అన్ని విధాల ఆదుకున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక సామాజిక న్యాయం పేరుతో బిసిలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 వేల మందికిపైన, రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది బిసిలపై అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు. వారి తరఫున తాను పోరాటం చేస్తున్నానన్నారు. 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నా, వాటికి ఇంత వరకు నిధులు కేటాయించడం పాపాన పోలేదన్నారు. అమరావతిలో కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లకు కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవని ఎద్దేవా చేశాడు. తాము అధికారంలోకి రాగానే బిసిలపైన పెట్టిన కేసులను ఎత్తివేస్తామని, అక్రమ కేసులు బనాయించిన అధికారులపై జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ వేసి శిక్షపడేలా చూస్తామన్నారు. యాదవ, కురువ, కుమ్మర, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, వడ్డెర, పద్మశాలి, రజకులు, వాల్మీకుల, పాలఏకిర్లకు ఇతర బిసి ఉపకులాలకు ప్రత్యేకంగా ఫెడరేషన్లను ఏర్పాటు చేసి దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం బిసి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఏర్పాటు చేసిన అన్ని పథకాలు రద్దు చేసి తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జగన్‌ బిసిలకు కొండంత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాకా చెవిలో పువ్వు పెట్టారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లకు క్వారీలు కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గం స్థాయిలో ఉప కులాల వారిగా భవనాలు నిర్మిస్తామని, ఆ తరువాత మండలాల వారీగా భవనాలు నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. తిరుమలతో సహా ఇతర దేవస్థానాల్లో దుస్తులు ఉతికే కాంట్రాక్ట్‌ రజకులకు కేటాయిస్తామన్నారు. టిడిపి హయాంలో బిసిలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లు జగన్‌ 10 శాతం తగ్గించి బిసిలకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. 16,500 మంది బిసిలు పదవులు కోల్పోయారని తెలిపారు. జగన్‌ తగ్గించిన రిజర్వేషన్లు తిరిగి కల్పిస్తామన్నారు. బిసి జనగణన జరగాలని అప్పుడే వారికి న్యాయం జరుగుతుందన్నారు. దీని కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నామని చెప్పారు. బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చేందుకు టిడిపి వేసిన సత్యపాల్‌ కమిటీ రిపోర్ట్‌ని జగన్‌ మూలన పడేశారన్నారు. 420కి ట్రేడ్‌ మార్క్‌గా జగన్‌ ఉన్నారన్నారు. నేను జగన్‌లా రూ.లక్ష కోట్లు దోచి జైలుకి వెళ్ళలేదన్నారు. బాబారుని చంపేసి నాట్‌ టూ అరెస్టు అని కోర్టుకు జగన్‌ అండ్‌ కో వెళ్లారని తెలిపారు. కేవలం ప్రజల తరపున పోరాడినందుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను రెడీగా ఉన్నానని తెలిపారు. వైసిపి పాలనలో ధరలు ఆకాశాన్నంటాయన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, ఇంటిపన్ను, చెత్తపన్నుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో పీల్చే గాలికి కూడా జగన్‌ రెడ్డి పన్ను వేసేలా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. జగన్‌ పాలన తాలిబన్ల పాలనను మించిపోయిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి గంటా నరహరి, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు జి.శంకర్‌ యాదవ్‌, దొమ్మలపాటి రమేష్‌, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఎస్‌.ఎం.ఫర్వీన్‌ తాజ్‌, రాజంపేట పార్లమెంట్‌ బిసి సెల్‌ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్‌, బిసి సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్‌ చిన్నబాబు, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు శ్రీనాథ్‌ రెడ్డి, పెద్దమండ్యం మండల టిడిపి అధ్యక్షులు జిట్టా వెంకటరమణ, మైసూర్‌ శ్రీనివాసులు యాదవ్‌, బెస్త సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు ముంబై దుర్గా, మహిళా నాయకులు విజయమ్మ మరియు పెద్దఎత్తున బిసి విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.