సిద్ధవటం : రాజంపేట నియోజకవర్గంలోని వైసిపి నాయకులు బినామీల పేర్లతో వేల ఎకరాలు కబ్జా చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 121 రోజుకు చేరుకుంది. శుక్రవారం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలంలోని చంటిగారిపల్లె విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమై మూలపల్లె, సిద్ధవటం, కమ్మపాలెం, జంగాలపల్లి విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా సిద్ధవటంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలు, ప్రజలకు జరిగిన అన్యాయం, సొంత పార్టీ కార్యకర్తలే వేసిన కర పత్రాలు వేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్‌రెడ్డి బినామీల పేరుతో వేల ఎకరాలు కొట్టేశాడన్నారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేస్తున్నారన్నారు. వారిద్దరూ రూ.15 కోట్లు జడ్పీ సొమ్ము కాజేశారని, జగన్‌ని ఆదర్శంగా తీసుకోని ఊరుకో ప్యాలస్ కట్టుకున్నారని పేర్కొన్నారు. మేడా హైదరాబాదులో ఒక ప్యాలెస్, బెంగుళూరులో మరో ప్యాలెస్, తిరుపతిలో ఒక ప్యాలెస్, రాజంపేటలో మరో ప్యాలెస్, స్వగ్రామం చెన్నాయగారిపల్లెలో మరో ప్యాలెస్ ఐదు ప్యాలెస్‌లను కట్టుకొని జగన్‌ను మించిపోయాడన్నారు. నందలూరు తన సొంత మండలమైన చెన్నాయగారిపల్లె చుట్టూ సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని తన చిన్నాన్న మేడా భాస్కర్‌రెడ్డితో కలిసి కబ్జా చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేని మించి జడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి తమ స్వగ్రామమైన రాజంపేట మండలం ఆకేపాడులో మూడు శ్మశానాలున్న గుట్టనే ఆక్రమించి అక్కడ మైసూర్ ప్యాలెస్ లాంటి ఇల్లును కట్టి చుట్టూ వందలాది ఎకరాలు భూకబ్జాలకు పాల్పడ్డాడన్నారు. మేడా, ఆకేపాటి స్వార్ధ ప్రయోజనాల కోసం రాజంపేటను సర్వనాశనం చేశారని విమర్శించారు. రాజంపేటను జిల్లా కేంద్రం కాకుండా అడ్డుకోవడం, మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకోవడం, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేయడం, ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, మున్సిపాలిటీకి వంద కోట్లు తెస్తానని హామీ ఇచ్చి రూపాయి తేకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడా స్వార్థం వలనే అన్నమయ్య, పింఛా డ్యాంలు కొట్టుకుపోయి 38 మంది చనిపోయారన్నారు. ఇసుకని దోచేసి టిప్పర్లలో బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఎక్స్ పోర్ట్ చేసి కోట్లు గడిస్తున్నాడన్నారు. టి సుండుపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు ప్రభుత్వ స్థలాలైన కొండలు, గుట్టలు చదును చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడని విమ ర్శించారు. నందలూరు మండలంలో ఎమ్మెల్యే చిన్నాన్న అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారని తెలిపారు. ఆఖరికి మాట వినకపోతే అధికారుల పై దాడులు, ట్రాన్స్ ఫర్లు చేయిస్తున్నాడన్నారు. ఒంటిమిట్టను ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా అభివద్ధి చేసింది టిడిపి అని పేర్కొన్నారు. రూ.100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఒంటిమిట్ట చెరువుకు సోమశిల జలాలు అందించడానికి రూ.30 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో గ్రామ సీమలను నిర్వీర్యం చేశారని తెలిపారు. పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా చిల్లిగవ్వ లేకుండా చేశారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు చెందిన రూ.8,600 కోట్లను ప్రభుత్వం దొంగిలించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తాగునీటిమ కోసం ప్రజలు ఐదు రోజులు నిరీక్షించాల్సి దౌర్భాగ్యం పట్టిందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తామని చెప్పారు. పంచాయతీలకు విధులు, నిధులు కల్పించి బలోపేతం చేస్తామన్నారు. సాగునీరు లేక భూములన్నీ బీళ్లుగా మారాయన్నారు. పాదయాత్రలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసలరెడ్డి, నాయకులు బత్యాల చెంగల్రాయుడు, చమర్తి జగన్‌మోహన్‌రాజు, గంటా నరహరి పాల్గొన్నారు.










