Dec 22,2022 22:48

నిరాహారదీక్షలో కూర్చొన్న గుత్తేదారుడు, తదితరులు

ప్రజాశక్తి - రొద్దం : మండలంలో స్థానిక మహాత్మా గాంధీ జ్యోతిరావ్‌ బాపూలే పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లు, తరగతి గదులకు సంబందించిన బిల్లులు చెల్లించాలని గుత్తేదారుడు ధనుంజయరెడ్డి డిమాండ్‌ చేశారు. బిల్లులు అందక పోవడంతో కాంట్రాక్టర్‌ ధనుంజయ రెడ్డి గురువారం స్థానిక పాఠశాల ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ధనుంజయరెడ్డి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు బాబులే పాఠశాలలో దాదాపు 17 లక్షల రూపాయలు వెచ్చించి రెండున్నర సంవత్సరాల క్రితం పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు తనకు యాభై పైసలు కూడా అందలేదని వాపోయాడు. బిల్లులు రాకపోవడంతో 20 రోజుల క్రితమే పాఠశాలకు తాళాలు వేసే ప్రయత్నం చేశానన్నారు. అయితే ప్రిన్సిపల్‌ గోపాల్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చాడన్నారు. అయితే ఇంతవరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నానని వాపోయాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గురువారం పాఠశాల ముందర ఆమరణ నిరసన దీక్ష దిగినట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ గోపాల్‌ ధనుంజరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.ఉన్నతాధికారులకు సమస్యను వివరిస్తానని నిరాహార దీక్ష విరమించాలని కోరారు. బిల్లులు అందే వరకు తాను దీక్షను విరమించబోనని రాత్రింబవళ్లు ఇక్కడే కూర్చుంటానని ధనుంజరెడ్డి తేల్చిచెపాపరు. ధనుంజయరెడ్డికి కొంతమంది మద్దతు తెలిపారు.