Dec 30,2022 20:26

ఫొటో : సమస్యను వివరిస్తున్నవరికుంటపాడు జెడ్‌పిటిసి రావెళ్ల నాగేంద్ర

బిల్లులు అందజేయకుండా ఇబ్బందులు
- జెడ్‌పి చైర్మన్‌ ఆనం అరుణమ్మతో జెడ్‌పిటిసి
ప్రజాశక్తి-వరికుంటపాడు : నాడు-నేడు పనులు చేస్తున్న పాఠశాల విద్యాకమిటీ చైర్మన్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్టిమేషన్ల ప్రకారం బిల్లులు అందజేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ జెడ్‌పిచైర్మన్‌ ఆనం అరుణమ్మకు వరికుంటపాడు జెడ్‌పిటిసి రావెళ్ల నాగేంద్ర వివరించారు. శుక్రవారం నెల్లూరులో జరిగిన జిల్లా జెడ్‌పి విద్యా వైద్య కమిటీ సమావేశంలో జెడ్‌పిటిసి మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తుంటే వరికుంటపాడు మండలంలో ఆ అభివృద్ధిని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన చెందారు. అనంతరం వైద్యం పరంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చూడాలని తెలిపారు.
ఆరోగ్య మిత్రలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే వరికుంటపాడు మండలంలో పూర్తిస్థాయిలో గ్రామీణ హెల్త్‌సెంటర్లను త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. అలాగే మండలంలో వివిధ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని, 10వ తరగతి పరీక్షలు కూడా దగ్గర పడుతున్నందున ఉపాధ్యాయులనూ ఏర్పాటు చేయాలని కోరారు.