సిపిఎం-సిపిఐ రాజకీయ ప్రచార భేరిలో నాయకులు
ప్రజాశక్తి-వాల్మీకిపురం : బిజెపితో దేశానికి తీవ్ర ప్రమాదం ఉందని.. రానున్న ఎన్నికల్లో బిజెపిని ఇంటికి సాగనంపడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కలసి రావాలని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, నరసింహులు పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాతా వాల్మీకిపురంకు చేరుకుంది. శుక్రవారం స్థానిక గాంధీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు అందుకు నడుం బిగించాలన్నారు. నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం, మోడీ ప్రభుత్వం హిందూత్వ కార్పొరేట్ కూటమనీ, ఓ వైపు దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నిస్తూనే మరో వైపు కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. దళితులు, ముస్లిం మైనార్టీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అనంతరం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి రామచంద్ర, నాయకులు రమేష్ బాబు, మహేష్, కృష్ణప్ప, సాంబశివ పాల్గొన్నారు. నిమ్మనపల్లి: ప్రధాని మోడీ దేశ సంపదను తన మిత్ర బందమైన అంబానీ, ఆదాని లకు దోచిపెడుతున్నారని, దేశ సంపదను కొల్లగొడుతున్న బిజెపిని ఇంటికి సాగనంపి దేశాన్ని కాపాడుదామని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్ నరసింహులు అన్నారు. దేశంలో బిజెపి ఆధ్వర్యంలో రాజ్యాంగ విలువలను కాలరాయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారన్నారు. మదనపల్లె అర్బన్: సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి మండలానికి చేరుకుంది. స్థానిక టమోటా మార్కెట్‌లో నిర్వహించిన సమావేశంలో సిపిఎం, సిపిఐ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, కె.మురళి మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ మదనపల్లిలో ఉందని, ఈ ప్రాంతంలో రైతాంగం అధికంగా టమోటా పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తుందన్నారు. మార్కెట్ కమిటీలు కానీ, అధికారులు కానీ ఏ మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. అధికారులు వ్యాపారస్తులు సిండికేటై రైతాంగాన్ని నిలువునా దోచేస్తున్నారని పేర్కొన్నారు. టమోటా దిగుబడి తగ్గి డిమాండ్ పెరిగి రైతుకి పది రూపాయలు చేతికొస్తున్నప్పుడు ధర నియంత్రణ పేరుతో అధికార యంత్రాంగం పాలకవర్గాలు ఆగమేఘాలపైన మార్కెట్లో వాలిపోతారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు తిరుమల, ఓబులేసు, శోభ, నాగరాజు పాల్గొన్నారు. రామసముద్రం : సిపిఐ సిపిఎం ప్రచార భేరి జీపు జాత రామసముద్రం చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శిలు నరసింహులు శ్రీనివాసులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈ దేశంలో రైతాంగాన్ని పూర్తిగా కార్పోరేట్ సంస్థలకు వ్యవసాయాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజా రైతు వ్యతిరేక చట్టాలను సమర్థిస్తూ తమ ఎంపీలు పార్లమెంట్లో బలపరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి, మండల నాయకులు సూరి, ఓబులేసు పాల్గొన్నారు.










