Apr 28,2023 22:15

ఫొటో : కరపత్రాలు పంచుతున్న సిపిఎం నాయకులు

బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుదాం..
ప్రజాశక్తి బిట్రగుంట : దేశంలో మతోన్మాద శక్తిగా వ్యవహరిస్తున్న బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుదాం.. అని జిల్లా కమిటీ సభ్యులు తాళ్లూరి మాలాద్రి, సిపిఎం మండల కార్యదర్శి తుమ్మల వెంకయ్య, సిఐటియు మండల కార్యదర్శి చల్ల నరహరి పేర్కొన్నారు. వామపక్షాలు తలపెట్టిన ప్రచారభేరి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోవూరుపల్లి, కడనూతల, అల్లిమడుగు, ఉమామహేశ్వరపురం, జువ్వలదిన్నె, బోగోలు, తెల్లగుంట, కొత్తూరు, నాగులవరం, జెపి గూడూరు, ఏనుగు బావి, కొండ బిట్రగుంట గ్రామాల్లో ప్రచారం చేసి కరపత్రాలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రతిఒక్క వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వాలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని, లేకపోతే మన భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేని పరిస్థితులు తీసుకొని వచ్చారని గ్యాస్‌, కరెంటు, డీజిల్‌, పెట్రోలు ప్రతిఒక్క వస్తువులపై రేట్లు పెంచి సామాన్యుడు బతకలేని పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తుందన్నారు. కార్పొరేట్‌ సంస్థలైన ఆదాని గ్రూపునకు ప్రభుత్వ ఆస్తులను ధర దత్తం చేస్తున్నారని, బ్యాంకులను, రైల్వేలను రైల్వే సంబంధించిన ఆస్తులను అదానీ సంస్థలకు అందజేస్తున్నారన్నారు. 75 సంవత్సరాల క్రితం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని సైతం నేడు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. అదాని గ్రూప్‌నకు అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని నిర్మించుకుంటున్నారని, ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పోట్లూరి శ్రీనివాసులు, మండల సిఐటియు ఉపాధ్యక్షుడు అన్వర్‌ భాషా, వామపక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.