బిజెపికి పాలించే అర్హత లేదు : కాంగ్రెస్
ప్రజాశక్తి - కావలి : రాహుల్ గాంధీకి 2 ఏళ్లు జైలు శిక్ష పేరుతో పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించిన దుష్ట బిజెపికి కేంద్ర ప్రభుత్వాన్ని పాలించే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎస్.కె.మస్తాన్‌వలీలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వైట్‌హౌస్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చింతాల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రపంచ ధనవంతుడు అదానికి రూ.20లక్షల కోట్లు నరేంద్రమోడీ దోచిపెట్టాడని హిండెన్‌బర్గ్ విదేశీపత్రికలో పేర్కొంటే, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నించాడని రాహుల్ గాంధీపై కేసు పెట్టారని తెలిపారు. ఈ కేసును అప్పటి జడ్జి మూసివేస్తే, ఇటీవల బిజెపి మార్కు ఆర్.ఎస్.ఎస్. జడ్జితో కేసును తిరగతోడించి, కారణం లేకపోయినా 2ఏళ్ల జైలు శిక్ష వేయించారని ఆరోపించారు. ఈ శిక్ష చూపించి 7ఏళ్లపాటు రాహుల్‌గాంధీ పార్లమెంట్ సహభ్యత్వానికి అనర్హుడుగా చేశారన్నారు. ఈ చర్యతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఈ విషయాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని సెక్యూలర్ పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా తాము జిల్లాలోని నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ప్రచారం చేశామన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీ నాయకులను, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు జరుపుతున్నామని వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను, ఎల్‌ఐసి, రైల్వేలను, తపాలాశాఖ, బిఎస్‌ఎన్‌ఎల్ తదితర కంపెనీలను జాతీయం చేసిందన్నారు. భూసంస్కరణల చట్టం, రాజభరణాల రద్దు చేశిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీనే ప్రవేశపెట్టిందేనని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ప్రజలు గర్హించాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి చింతాల వెంకట్రావు, నాయకులు లేళ్లపల్లి సురేష్‌బాబు, అనిల్ కుమార్, గణేశ్‌బాబు, రంగస్వామి, రాంభూపాల్‌రెడ్డి, మానస, లత, తదితరులు పాల్గొన్నారు.










