Jan 30,2022 08:37

భారత రైతాంగం ఏడాదిపాటు సాగించిన పోరాట ఫలితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. నవంబర్‌ 19న ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని... ఢిల్లీ పరిసరాలలో ఉన్న రైతులందరూ తమ ఇళ్ళకు వెళ్ళి గురునానక్‌ జయంతిని జరుపుకోమని ప్రకటించారు. మోడీ ప్రకటన అనంతరం నవంబర్‌ 21న సంయుక్త కిసాన్‌ మోర్చా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. రైతు ఉద్యమానికి తొలి విజయం లభించిందని, రైతు వ్యతిరేక చట్టాలు మాత్రమే రద్దయ్యాయని, పంటలకు మద్దతు ధరలు చేయడం, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించడం వంటి డిమాండ్లు పట్టించుకోలేదని అభిప్రాయపడింది. చర్చల ద్వారా డిమాండ్లు అన్ని పరిష్కరించాలని, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాయాలని, అప్పటి వరకు నిర్ణయించిన ఉద్యమ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించింది. నవంబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయితీ పేరు భారీ బహిరంగసభ నిర్వహించింది. సభకు హాజరైన యావత్‌ ప్రజానీకం హాజరైన ఆ సభలో ఉద్యమాన్ని కొనసాగించాలని, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ ఎన్నికలలో బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చింది. మిగిలిన డిమాండ్లపై చర్చించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రధాన మంత్రికి లేఖ రాసింది. నవంబర్‌ 28న భారత దేశానికి ఆర్థిక రాజధాని అయిన ముంబాయి నగరంలో భారీగా కిసాన్‌ మజ్దూర్‌ సభ నిర్వహిం చింది. నవంబరు 29న పార్లమెంటులో నిజాయితీ లేకుండా, ప్రజా స్వామిక విధానం లేకుండా, ఏ చర్చా లేకుండా 4 నిమిషాలలో చట్టాల రద్దు ముగిసింది.
    ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమాన్ని బలహీనపరచ డానికి, అణచడానికి చేసిన కుయుక్తులు, కిరాతకాలు రైతాంగ పోరాటం ముందు నిలవలేదు. ఉద్యమ ఐక్యత చెదరలేదు. ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్‌ 5న జరిగిన బహిరంగ సభలో 10 లక్షల మంది పాల్గొనడం, సెప్టెంబర్‌ 27న సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన భారత్‌బంద్‌కు అపూర్వ మద్దతు రావడం, లఖింపూర్‌ హత్యాకాండపై దేశంలోనూ, దేశం వెలుపలా అనూహ్యమైన స్పందన, వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసుకోక తప్పలేదు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకున్న సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వం ఉద్యమానికి విరామం మాత్రమేనని 2017 నుండి పోరాడు తున్న మద్దతు ధరల చట్టం, ఇతర డిమాండ్స్‌ నెరవేరేవరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.
     డిసెంబరు 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వానికి అధికారిక లేఖను పంపింది. అందులో 1). కనీస మద్దతు ధరల అంశంపై కమిటీ వేస్తామని, కమిటీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు ఉంటారని పేర్కొన్నారు.
2). ఆందోళన జరుగుతున్న కాలంలో రైతులపై పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేస్తామని ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు ప్రకటించాయి. ఢిల్లీ, ఇతర కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదు చేసిన కేసులు రద్దు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది.
3). ఆందోళన సందర్భంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించడానికి ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు అంగీకరిం చాయి. పంజాబ్‌ ప్రభుత్వం ఇంతకు ముందే బహిరంగ ప్రకటన చేసింది.
4). ముసాయిదా విద్యుత్‌ సవరణ బిల్లులో రైతులకు సంబంధించిన అంశాలపై సంబంధిత సంస్థలు సంయుక్త కిసాన్‌ మోర్చాతో చర్చలు జరుపుతారు. తరువాతనే బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెడతారు.
5). కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టంలోని 14, 15 సెక్షన్లతో నమోదు చేసిన కేసుల నుండి పంట గడ్డిమోళ్ళను తగులపెడుతున్న రైతులకు విముక్తి కల్పిస్తారు.
     పై లేఖ పంపి 50 రోజులు దాటింది. ఫిబ్రవరి 1 నుండి రెండవ విడత పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన హామీల అమలుకు తగిన చర్యలు తీసుకోలేదు. లఖింపూర్‌ హత్యాకాండకు బాధ్యుడైన మంత్రి అజరుమిశ్రా మంత్రివర్గంలోనే కొనసాగుతున్నాడు. వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తిరిగి వ్యవసాయ బిల్లులు తెస్తామని ప్రకటించారు.
     ఈ స్థితిలో సంయుక్త కిసాన్‌ మోర్చా జనవరి 31న కేంద్ర ప్రభుత్వ విద్రోహదినం జరపాలని నిర్ణయించింది. ఈ పిలుపుకు దేశంలోని అన్ని కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ వంచనను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. కనీస మద్దతు ధరలకు చట్టభద్రత కల్పించడం, మరణించిన రైతు కుంటుంబాలకు పరిహారం చెల్లించడం, ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించడం, లఖింపూర్‌ హత్యాకాండకు బాధ్యులైన వారిని శిక్షించడానికి సంబంధించి చర్యలు తీసుకొనేందుకుగానూ రాష్ట్రంలోని అన్ని పట్టణ, మండల, జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉద్యమాన్ని సాగించాల్సి ఉంది.
                                                     - వై కేశవరావు ఎ.పి. రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు