Jan 01,2022 13:24
  • వివాదంలోకి గుంటూరు జిన్నా టవర్‌

ప్రజాశక్తి - యంత్రాంగం : ప్రత్యేకహోదా, విశాఖ ఉక్కు విషయంలో బిజెపి వైఖరి పట్ల ఆగ్రహంగా ఉన్న రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేసింది. రెండు రోజుల క్రితం తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్‌లిక్కర్‌ ఇస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన అభాసుపాలు కావడంతో తాజాగా విషవ్యూహానికి తెరతీసింది. దీనిలో భాగంగా గుంటూరు నగరంలోని జాతీయోద్యమానికి, మత సామరస్యానికి చిహ్నంగా ప్రఖ్యాతిగాంచిన జిన్నా టవర్‌ను వివాదంలోకి లాగింది. దేశ స్వాతంత్య్రానికి ముందు నుండి ఉన్న ఆ పేరును మార్చాలని, లేనిపక్షంలో కూల్చివేస్తామని ప్రకటించింది. బిజెపి ఈ చర్యను వామపక్షాలతో పాటు మేథావులు, లౌకిక వాదులు తీవ్రంగా ఖండించారు. ఐక్యంగా ఉండాలని, విభజన కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. ఒకరిద్దరు వైసిపి నాయకులు మాట్లాడినప్పటికీ, ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం పెదవి విప్పలేదు. తెలుగుదేశం పార్టీ అధినేతదీ ఇదే తీరు.
 

ఇలా విషం చిమ్మారు...
బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ట్వీట్‌తో ఈ విషవ్యూహం ప్రారంభమైంది. పాకిస్తాన్‌లో పెట్టాల్సిన పేరును గుంటూరులో ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ఆ టవర్‌కు అబ్దుల్‌ కలామ్‌ లేదా గుర్రం జాషువా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని పేర్కొన్నారు. లేని పక్షంలో కూల్చివేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగానే రంగంలోకి వచ్చిన రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి జిన్నా టవర్‌ పేరు మార్చకపోతే దానిని బిజెపి కార్యకర్తలు కూల్చివేస్తారని చెప్పారు. దేశ రాజధానిలోని ఔరంగజేబు రోడ్డు పేరునే తమ ప్రభుత్వం మార్చి వేసిందని, జిన్నా టవర్‌ పేరు ఎందుకు మార్చలేమని అన్నారు. ఆ తరువాత కాసేపటికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విడుదల చేసిన వీడియోలో గుంటూరులో టవర్‌ను జిన్నా పేరుతో పిలవడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన వారి పేర్లు పెట్టాలని, విభజనకు కారణమైన వారి పేర్లను పెడితే తాము సహించేది లేదని అన్నారు.
 

ఆ పేరు ఎలా వచ్చింది...!
శాంతికి, మత సామరస్యానికి చిహ్నంగా కుతుబ్‌మినార్‌ తరహాలో 1942లో ఈ టవర్‌ నిర్మాణం ప్రారంభించి 1945లో పూర్తి చేశారు. దీని ప్రారంభోత్సవానికి దేశ స్వాతంత్ర ఉద్యమంలో అప్పట్లో కీలకపాత్ర పోషిస్తున్న మహ్మద్‌ఆలీ జిన్నాను స్థానిక నాయకులు లాల్‌జాన్‌బాష ఆహ్వానిం చారు. ఆయన ఇటీవల మృతి చెందిన టిడిపి సీనియర్‌ నేత లాల్‌జాన్‌భాషకు తాత. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన జిన్నా తన ప్రతినిధిగా జుదాలియద్‌ ఆలీఖాన్‌ను పంపారు. జిన్నా వస్తారని నిర్మించిన కట్టడం కావడంతో స్థానికులు ఆ పేరుతోనే పిలుస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో స్థానిక నాయకుల్లో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను జిన్నా పరిష్కరించడంతో దానికి గౌరవసూచకంగా ఆయన్ను ఆహ్వానించారని సమాచారం. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి సత్తెనపల్లి మండలం కొమ్మదిపూడిలో 14 మందికి స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించిందని, ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధిగా ఉన్న లాల్‌జాన్‌భాష చొరవతో మహ్మద్‌ ఆలీజిన్నా ముంబాయి కోర్టులో వాదించి ఉరిశిక్షను రద్దు చేయించారని, దానికి కృతజ్ఞతగా ఈ టవర్‌ నిర్మించారని కూడా చెబుతారు. అప్పటి నుండి నగరపాలక సంస్థ పర్యవేక్షణలోనే ఉన్న ఈ టవర్‌ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
 

బిజెపి కుతంత్రాలను తిప్పికొట్టండి : సిపిఎం
బిజెపి కుతంత్రాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు, మేధావులు బిజెపి కుయుక్తులను ఖండించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ప్రకటన విడుదల చేశారు. చారిత్రాత్మకమైన గుంటూరు జిన్నా టవర్‌ను వివాదం చేసి, ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రగిల్చి, రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు బిజెపి నాయకులు చేస్తున్న ప్రయత్నాలను సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తోందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మత సామరస్యానికి నిలయంగా ఉన్న గుంటూరు నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న బిజెపి ప్రయత్నాలను అన్ని మతాలకు, తరగతులకు చెందిన ప్రజలందరూ వ్యతిరేకించాలని, గుంటూరు ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు
 

గుంటూరుకే పరిమితమా...?
బిజెపి విషవ్యూహం గుంటూరుకే పరిమితమనుకుంటే పొరపాటే! ప్రజలను మత ప్రాతిపదికన చీల్చడం. ఘర్షణలు రెచ్చగొట్టి ఓటుబ్యాంకుగా మార్చుకోవడమన్నది ఆ పార్టీకి పరిపాటే. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ తరహా వ్యూహంతో నే అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రంలోనూ అటువంటి వ్యూహాలనే అనేక ప్రాంతాల్లో అమ లు చేస్తోంది. అందుకే అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.