అనంతపురం కలెక్టరేట్ : ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బిజెపికి వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి తెలిపారు. బుధవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా రక్షణభేరి కార్యక్రమంలో భాగంగా ఆర్‌టిసి బస్టాండ్, శ్రీకంఠం సర్కిల్ తదితర ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణి చేశారు. ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్ని విధాలా బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్ర సంపాదన దోచి పెడుతుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రతిపక్షం పార్టీలు తెలుగుదేశం, జనసేన పార్టీలు నరేంద్ర మోడీకి భజన చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడుదామని ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ఎన్టీఆర్ శీన, ఆటో యూనియన్ నాయకులు నాగరాజు, శివ, బంగారు నాగరాజు, మురళి, భవాని శీన, ప్రసాద్, నిజాం, బాషా, నందమూరి శీన, బుడ్డప్ప నగర్ భాషా, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.