బిజెపి పాలనకు చరమగీతం పాడదాం సిపిఎం-సిపిఐ రాజకీయ ప్రచార భేరిలో నాయకులు
కడప అర్బన్ : ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ, ప్రజల మధ్య వైశమ్యాలను రెచ్చగొట్టి, దేశ సమైక్యత, సమగ్రతకు తూట్లు పొడుస్తున్న బిజెపి, మద్దతిస్తున్న వైసిపిలను రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ పిలుపునిచ్చారు. బుధవారం ఆర్కే నగర్‌లో ప్రచార భేరిని ప్రారంభించి వారు మాట్లాడుతూ నల్లధనం వెలికితీత, రైతు ఆదాయం రెట్టింపు, పేదరిక నిర్మూలన, ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన, ధరల స్థిరీకరణ, దేశ సమైక్యత సమగ్రాభివద్ధి సాధించడంలో బిజెపి ఘోరంగా విఫలమైందన్నారు. పెట్రోలు డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు జిఎస్టి వల్ల పనుల భారం తగ్గుతుందన్న మోడీ ప్రకటనకు విరుద్ధంగా ప్రజలపై పన్నుల భారం పెరిగిందన్నారు. ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టి దేవుని పేరుతో దేశభక్తి పేరుతో కులం పేరుతో మతం పేరుతో రెచ్చగొడుతూ, తినే తిండి, కట్టుకునే బట్టపై ఆంక్షలు విధిస్తూ దళిత మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నదన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకటశివ, నగర సహాయ కార్యదర్శి బాదుల్లా, మద్దిలేటి, బందల ఓబయ్య, సావంత్ సుధాకర్ సిపిఎం నగర నాయకులు చంద్రారెడ్డి, ఓబులేసు, సిపిఐ నగర నాయకులు బ్రహ్మం, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, అంకుశం, వలరాజు, నాగార్జున, సంజీవ్, అరుణ్, తేజ పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్ : తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ బిజెపి పరిపాలనలో ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేసి సంపన్నులకు రాయితీలు ఇచ్చి పేదలపై అనేక భారాలు మోపారని సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి వీరనాల శివనారాయణ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ప్రసాద్ విమర్శించారు. స్థానిక పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బిజెపి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డివైఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, నాయకులు ప్రసాద్‌రెడ్డి, దండు రవి, కమాల్ బాషా, ఆదాము, మన్సూర్, మారి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. చింతకొమ్మదిన్నె : బిజెపి మతోన్మాద కార్పొరేట్ అనుకూల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ చేపట్టిన ప్రచారభేరిని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి అన్నారు. వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు గోపాలకృష్ణయ్య, శ్రీనివాసరెడ్డి, చిన్న సిద్ధయ్య పాల్గొన్నారు.










