రాజంపేట అర్బన్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఓటమితోనే దేశానికి రక్షణ అని సిపిఎం, సిపిఐ నాయకులు అన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక శ్రామిక వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిని రాజకీయ ప్రచార భేరి శనివారం రెండో రోజూ సాగింది. పట్టణంలోని హరిశ్చంద్రనగర్‌లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అదానికి దేశాన్ని తాకట్టు పెడుతున్న బిజెపిని తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి చిట్వేలి రవికుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణదేవరా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు రమణ, నాయకులు నరసింహులు, అహ్మద్ పాల్గొన్నారు. కలకడ: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రతీ పౌరుడు గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాలని, ప్రజావ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని ఇంటికి సాగనంపి, దేశాన్ని కాపాడుకుందామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కల వెంకటేష్ పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు జలాలుద్దీన్, అబీబ్, అషన్ షా, శావత్, రియాజ్, వెంకటరమణ నరసింహులు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్ : పట్టణంలోని పలు కాలనీల్లో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజలపై వేస్తున్న భారాలను వివరించారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు టి.హరీంద్రనాథ్ శర్మ, మురళీ, ప్రభాకర్‌రెడ్డి, పవన్ కుమార్, వెంకటేష్, సహదేవ, సూరి, తిరుమల, శోభ, ఓబులేసు పాల్గొన్నారు.










