మదనపల్లె అర్బన్ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజల ప్రయోజనాలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతూ, ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సిపిఎం, సిపిఐ నాయకులు అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక శ్రామిక వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ప్రచార భేరిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో బిజెపి నాయకులు రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాన్ని నడపలేరని, వారు ముస్సొలీన్ భావజాలానికి చెందినవారని, వారు రాజ్యాంగాన్ని మార్చి మనిషిని మనుషులుగా కూడా చూడలేని మనుధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయ్యాలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యక హోదా, విభజన హామీలు, పోలవరం నిర్మాణం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నోరు మెదపడం లేదని, రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు మూడు కేవలం అధికార దాహంతో బిజెపి ముందు సాగిలబడుతున్నాయే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. మూడు పార్టీలు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని తెలిపారు. బిజెపి పట్ల వీరి వైకిరి ఏమిటో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో మూడు పార్టీలు అధికారం కోసం మోడీ జపం చేస్తున్నారని, వీరివల్లా రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీలేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె.మురళి, నాయకులు టి.హరీంద్రనాథ్‌రెడ్డి, కృష్ణప్ప, తిరుమలరెడ్డి, సూరి, ఓబులేసు, అనసూయ, శోభ పాల్గొన్నారు.
రాజంపేట అర్బన్ : రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న బిజెపిని దేశం నుండి తరిమికొట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి చిట్వేలి రవికుమార్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రచార భేరి ప్రారంభించారు. బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. ప్రతి వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. మోడీ, అమిత్‌షాల నాయకత్వంలో బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండవలసిన ప్రజలనుధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తున్నదని తెలిపారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ నిరంకుశంగా అణచివేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం.శివరామకృష్ణదేవరా, సహాయ కార్యదర్శి ఎమ్మెస్ రాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఉపాధ్యక్షులు రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి సికిందర్, వ్యవసాయ కార్మిక సంఘం నియోజవర్గ అధ్యక్ష, కార్యదర్శులు రాజా, నరసింహులు, ఉపాధ్యక్షులు రవి, చలం పాణి నరసింహులు, ఎఐటియుసి నాయకులు నాగేశ్వర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఉపేంద్ర పాల్గొన్నారు.
- నిరసన తెలుపుతున్న నాయకులు
- కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులు










