Jan 08,2023 21:19

నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : బిజెపి జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్‌రెడ్డి కార్యాలయం ముందు అదే పార్టీకి చెందిన కార్యకర్తలు ఆదివారం ధర్నా నిర్వహించారు. తమకు కల్లిబొల్లిమాటలు చెప్పి పార్టీలోకి చేర్పించుకుని మోసం చేశాడని హిందూ, ముస్లిం మహిళా కార్యకర్తలు వాపోయారు. అంతకు ముందు టవర్‌ క్లాక్‌ నుంచి వజ్ర భాస్కర్‌ రెడ్డి రెడ్డి కార్యాలయం వరకు హిందూ, ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దాదాపు గంట పాటు భాస్కర్‌ రెడ్డి కార్యాలయం ముందు ధర్నా చేశారు . భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలు కృష్ణవేణి, అబీద, భవాని, రేణుక, ఎల్లమ్మ తదితరులు మాట్లాడుతూ వజ్ర భాస్కర్‌ రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. గతంలో వైసిపిలో పనిచేస్తున్న తాము వజ్రభాస్కర్‌రెడ్డి మాటలు నమ్మి మోసపోయామన్నారు. పార్టీలోకి చేరినప్పటి నుంచి కుటుంబాలను వదిలేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన వెన్నంటే నడిచామన్నారు. ప్రస్తుతం రోడ్డుపాలయ్యామని అన్నారు.కదిరి పట్టణంలో ఒక్కొక్క కార్యకర్తకు ఇంటికోసం ఐదు సెంట్లు స్థలం తోపాటు ఇల్లు నిర్మించి ఇస్తానని, 25 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని, పిల్లల చదువు అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చాడన్నారు. ఆయన మాటలు నమ్మి మూడు సంవత్సరాల క్రితం పార్టీలోకి చేరి అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల క్రితం వజ్ర భాస్కర్‌ రెడ్డి తమకు ఇంటిస్థలాలు చూపి ఇక్కడ పునాదులు వేసుకుని గృహాలు నిర్మించుకోవాలని చెప్పారన్నారు. అయితే ఆ స్థలం ప్రభుత్వ స్థలమని అన్నారు. భాస్కర్‌ రెడ్డి ఆయన తమ్ముడు సోమశేఖర్‌ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి తాము మోసపోయామన్నారు. గత రంజాన్‌ మాసంలో కదిరి నియోజకవర్గం లో ముస్లింలకు రంజాన్‌ తోఫాకు అని 50 లక్షల రూపాయలు చెక్కును ఇస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రెండు నెలల క్రితం కుటాగుల మున్సిపాలిటీ పరిధిలో 5 లక్షల రూపాయలు చెక్కును ఇస్తున్నట్లు పత్రికల్లో రాయించుకొని తిరిగి ఆ చెక్కును వెనక్కు తీసుకున్నారని విమర్శించారు. ఇదేమని అడిగితే 'రాజకీయ నాయకులు ఎన్నో చెప్తాం.. అవన్నీ ఇవ్వాలని రూల్‌ ఉందా' అని చెప్పి తమ పట్ట దురుసుగా వ్యవహరించారని మహిళలు ఆరోపించారు. ఆయన చేసిన మోసాలు, బినామీల వ్యవహారాన్ని బయటపెడతామని అన్నారు. పార్టీ రాష్ట్ర పెద్దలు ఈ విషయంలో చొరవ తీసుకొని తమకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమయంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గిరిజమ్మ భర్త అక్కడివచ్చి ఆందోళనకారుల పట్ల దురుసుగా వ్యహరించడంతో వారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర్‌ రెడ్డి బయటికి రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రతరం కావటంతో పట్టణ పోలీసులు జోక్యం చేసుకున్నారు. మహిళా కార్యకర్తలను సర్ది చెప్పేప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాజ, రమీజా, ఝాన్సీ, లక్ష్మీదేవి, బాబా పక్రుద్దీన్‌, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.