ప్రజాశక్తి మడకశిర రూరల్ : రెజ్లర్లపై వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని ఐద్వా జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్షాద్ డిమాండ్ చేశారు. రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా ఐద్వా ఆధ్వర్యంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌభాగ్య అధ్యక్షతన మడకశిరలో నిరసన ర్యాలీ, మానవహారం కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిల్షాద్ మాట్లాడుతూ 45 రోజుల నుండి రెజ్లర్లు, క్రీడాకారులు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అయితే మహిళా క్రీడాకారుల సమస్యను వినడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇముడింపజేస్తూ పతకాలు తెచ్చిన క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడి అవమాన పరచి దేశ గౌరవానికి మచ్చ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేటీ పడావో బేటీ బచావో అనే నినాదం మాటలకే తప్ప చేతలకు కాదని నిరూపించారన్నారు. దేశంలో ఉన్న సెలెబ్రెటీల పరిస్థితే ఈ రకంగా ఉంటే సామాన్య మహిళల పరిస్థితులు ఏ రకంగా ఉంటుందో అన్నది ఈ సంఘటన బట్టి అర్థమవుతుందని అన్నారు. మహిళలు బహిరంగంగా తమపై వేధింపులకు పాల్పడ్డారని అన్ని ఆధారాలతో చెప్పుకున్నా కనీస చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోవడం చూస్తుంటే మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం ఏపాటిదో అర్థమవుతుందన్నారు. దేశ నలుమూలలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రెజ్లర్ల పోరాటానికి మద్దతు పెరుగుతోందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రెజ్లర్లకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాబోవు కాలంలో ఈ దేశ మహిళలు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల మహిళలు , సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఇంతియాజ్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య , కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు రమణా నాయక్ , సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, కెవిపిఎస్ జిల్లా నాయకులు రామాంజనేయులు, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.










