Dec 16,2021 07:02

విశాఖ ఉక్కు సంఘీభావ దీక్షను గత ఆదివారంనాడు (12-12-21) మంగళగిరిలో చేపట్టిన పవన్‌కల్యాణ్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ బాధ్యత వైసిపిదేనని, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వైసిపి ఎంపిలు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణపై ప్లకార్డులతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలను వ్యక్తపరచాలని ఆయన తెలిపారు. అలా అంటూనే జనసేన పార్టీ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కట్టుబడివుంటుందని, అఖిల పక్షంతో కూర్చుని ప్రైవేటీకరణను ఆపేందుకు మావంతు ప్రయత్నం మేము చేస్తామని తెలిపారు.
దీనికి ప్రతిస్పందిస్తూ వైసిపి అధికారప్రతినిధి అంబటి రాంబాబు జనసేన బిజెపికి మిత్రపక్షం గనుక స్టీల్‌ప్లాంట్‌ ను ప్రైవేటీకరించవద్దని జనసేనాని ఆ కేంద్ర ప్రభుత్వానికే చెప్పి గట్టిగా అడిగి ఆ ప్రైవేటీకరణను ఆపవచ్చుగదా అని అన్నారు.
''అందరూ శాఖాహారులే, కాని బుట్టలో రొయ్యలు మాత్రం కనిపించడంలేదు'' అన్న నానుడి గుర్తుకొస్తోంది. విశాఖ ఉక్కును అమ్మేయడానికి నిర్ణయించినది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. ఆ మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి అడగడానికి పవన్‌ కల్యాణ్‌ గాని, వైసిపి గాని సిద్ధంగా లేవు. ''నువ్వంటే నువ్వు'' అనుకుంటూ మోడీని నిలదీసి అడిగే పనిని మాత్రం ఎదుటివారిమీదకి నెట్టివేస్తున్నారు. ఇంకొక ప్రధాన పార్టీ తెలుగుదేశం కూడా మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు.
ఆనాడు డిసిఐ ని ఏవిధంగా కాపాడుకున్నామో, ఇప్పుడూ స్టీల్‌ ప్లాంట్‌ ని అదే విధంగా కాపాడుకుందాం అంటున్నారు పవన్‌ కల్యాణ్‌. ఐతే ఆనాడు డిసిఐ ని కాపాడుకోడానికి నడిపిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది. అప్పుడు పవన్‌ కల్యాణ్‌ వామపక్షాలతో కలిసి బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. విశాఖ కార్మిక వర్గం యావత్తూ డిసిఐ కార్మికులకు బాసటగా నిలిచింది. ప్రజా ఉద్యమ ఒత్తిడి ముందు కేంద్రం తలొగ్గక తప్పలేదు. మరి ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో కూడా అదే విధంగా చేయాలంటే పవన్‌ కల్యాణ్‌ బిజెపి పట్ల తన వైఖరి ఏమిటన్నది ముందు చూసుకోవాలి కదా? ఆనాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని గళమెత్తి బిజెపిని విమర్శించిన పవన్‌ అదే గళంతో ఇప్పుడు మోడీని ఆకాశానికెత్తుతున్నాడు. పి.ఎం కేర్స్‌ కు ప్రజలు వేల కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడమే మోడీ నిజాయితీకి నిదర్శనం అంటూ నిజాయితీకి కొత్త భాష్యం సైతం చెప్పారు. ఐతే ఆ భాష్యమే కొంత తిరకాసుగా కనిపిస్తోంది. ప్రజలు వేల కోట్ల రూపాయలు పి.ఎం కేర్స్‌ కి విరాళాలు ఇచ్చారు. అది ప్రజల నిజాయితీకి నిదర్శనం. ఆ నిధులకు లెక్కలు చెప్పనవసరం లేదని, వాటి లెక్కలను పార్లమెంటు కూడా పరిశీలించడానికి వీలు లేదని, ఆ వివరాలను గోప్యంగా ఉంచింది మోడీ ప్రభుత్వం. లెక్కలు చెప్పకపోవడం, జవాబుదారీతనం లేకపోవడంవెనుక ఏ విధమైన నిజాయితీ పవన్‌ కల్యాణ్‌ గారికి కనిపించిందో మరి!
విశాఖ ఉక్కు పరిరక్షణకు అఖిల పక్షంతో కలిసి జనసేన ఉంటుందని ప్రకటించారు. మంచిది. దానిని ఉక్కు కార్మికులు స్వాగతించారు కూడా. అయితే ఆ అఖిల పక్షంలో వైసిపి కూడా ఒక భాగంగా ఉండాలా? వద్దా? ఉక్కు కార్మికులు తమ మధ్య ఉన్న అన్ని విభేదాలనూ పక్కనబెట్టి, ఐక్యంగా పట్టుదలగా గత 300 రోజులకు పైగా పోరాడుతున్నారు. వారంతా ఈ రాజకీయ పార్టీల నుండి కోరుకుంటున్నది ఏమిటి? కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ కలిసి ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్న తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. ఈ పోరాటమే బిజెపి విధానానికి వ్యతిరేకం. కనుక బిజెపి మినహా తక్కిన అన్ని రాజకీయ పార్టీలూ తమకు అండగా నిలబడాలని వారు కోరుతున్నారు. అదీ అఖిలపక్ష స్ఫూర్తి అంటే. అటువంటి స్ఫూర్తిని పవన్‌కల్యాణ్‌ ప్రదర్శించడానికి సిద్ధమేనా? సిద్ధమే ఐతే, ముందు బిజెపి నుండి విడగొట్టుకోవాలి కదా? మోడీ భజన చేస్తూ విశాఖ స్టీలు విషయంలో మాత్రం పోరాటం చేస్తారా?
ఇక ప్రధానంగా పోరాడవలసినది కేంద్ర విధానం మీద అయినప్పుడు, అందుకోసం రాష్ట్రం లోని తక్కిన పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమించవలసినప్పుడు, విమర్శ ప్రధానంగా ఎవరిమీద ఎక్కుపెట్టాలి ? బిజెపి మీదా ? లేక తక్కినవారిమీదా?
ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేయడానికి సిద్ధం అంటున్న పవన్‌ కల్యాణ్‌ గారికి పోరాటం మీద ఉన్న గౌరవం ఏపాటిది? ఢిల్లీలో సంవత్సరం పాటు చలిని, వానను, ఎండను, కోవిడ్‌ ను లక్ష్యపెట్టకుండా నిర్బంధాలను సైతం ఎదిరించి 700 మందికి పౖౖెగా ఉద్యమకారుల ప్రాణాలను బలిపెట్టి మోడీ మెడలు వంచి విజయం సాధించారు రైతులు. వారి పోరాటం అంతా మోడీ చేసిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగానే సాగింది. కాని పవన్‌ కల్యాణ్‌ ఆ దుర్మార్గ చట్టాలు చాలా మంచివి అంటూ మోడీ భజన చేశారు. ఇదేనా రైతు పోరాటం పట్ల ఉన్న గౌరవం ? మోడీ నిజాయితీ గొప్పది అని, మోడీ చేసిన చట్టాలు మంచివి అని కితాబులిస్తూ ఇంకోపక్క విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడతామని మీరు అంటే ఆ మాటలకు విశ్వసనీయత ఉంటుందనే అనుకుంటున్నారా?
ఈ ప్రశ్నలను వైసిపి గాని, తెలుగుదేశం పార్టీ గాని అడిగే పరిస్థితిలో లేవు. ఎందుకంటే ఆ పార్టీలు కూడా రైతు చట్టాలను ఆనాడు పార్లమెంటులో బలపరిచాయి. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వంత పాడుతూనే వున్నాయి. విభజన హామీల అమలు విషయంలోగాని, రాష్ట్రాల అధికారాలపై, హక్కులపై మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడి విషయంలో గాని, నిధులను ఇవ్వకుండా ఎగనామం పెట్టిన విషయంలో గాని మోడీని గట్టిగా నిలదీసే స్థితిలో అధికార వైసిపి గాని, ప్రతిపక్ష టిడిపి గాని లేకపోవడమే నేడు ఆంధ్రప్రదేశ్‌ దౌర్భాగ్యం.
ఇంత దౌర్భాగ్యంలోనూ మనకు కనిపిస్తున్న ఆశాకిరణం విశాఖ ఉక్కు కార్మికుల ఐక్య పోరాటం. అది విజయవంతం కావాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలూ కోరుకుంటున్నారు. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. దానిని కాదన్న ప్రభుత్వాలు దిగివచ్చాయి గతంలో. ప్రజా పోరాటమే ఆ నాటి ప్రభుత్వాల మెడలు వంచింది. ఇప్పుడు కూడా అటువంటి పోరాటమే అవసరం. ఆ విధమైన పోరాటానికి అండదండలనిచ్చి తమ నిబద్ధతను రుజువు చేసుకోవలసిన రాష్ట్రంలోని పార్టీలు-ముఖ్యంగా వైసిపి, టిడిపి, జనసేన ఉక్కు ఉద్యమాన్ని తమ రాజకీయ చదరంగంలో క్రీడా ప్రాంగణంగా వాడుకోదలిస్తే తెలుగు ప్రజలు సహించరు.
ఇప్పటికే ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్‌, కడప ఉక్కు స్థాపన, నిధుల విడుదల, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణం వంటి విషయాల్లో బిజెపి ఆంధ్ర రాష్ట్ర ద్రోహిగా నిలిచింది. విశాఖ ఉక్కు అమ్మకం ఆ ద్రోహానికి పరాకాష్ట. ఇప్పుడైనా మన తెలుగు పార్టీలు-వైసిపి, టిడిపి, జనసేన ఈ ద్రోహాన్ని ఎదిరించి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం నికరంగా, నిజాయితీగా నిలబడాలి.

                                                                                                                                                        -    ఎం.వి.ఎస్‌. శర్మ