లక్నో : అబద్ధాలు చెబుతూ బిజెపి పబ్బం గడుపుకుంటున్నారని సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. ఈ అబద్దాలతో ప్రజలు విసిగిపోయారని, మార్చి 3న ఎస్పీకి ఓట్లు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారని అఖిలేష్ పేర్కొన్నారు. యుపిలో 6వ దశ ఎన్నికలు మార్చి 3న జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్ మంగళవారం బలియాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీనుద్దేశించి అఖేలేష్ మాట్లాడుతూ... బిజెపిలో చోటా నేతలు చిన్నఅబద్దాలు చెబుతుంటే బడా నేతలు భారీ అబద్దాలతో ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఇక ప్రధాని మోదీ అతిభారీ అబద్ధాలను పదేపదే వల్లెవేస్తుంటారని ఘాటుగా విమర్శించారు. రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని బలియా ప్రజలను బిజెపి పలు సందర్భాల్లో మోసం చేసిందన్నారు. బిజెపి భాగస్వామ్య పక్షాలు, మద్దతుదారులకు ఈ విషయం తెలిసినా వారు కూడా అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. యుపి అసెంబ్లీ ఎన్నికలు మార్చి 7న చివరి దశ జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.










