సిపిఎం మహాసభల ప్రారంభోపన్యాసంలో ఏచూరి
కన్నూర్ (ఇకె నయనార్ నగర్) : బీజేపీని ఓడించి దేశాన్ని రక్షించేందుకు లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలన్నీ ఏకం కావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీని ఏకాకిని చేసేలా ఈ మహాసభల్లో తమ రాజకీయ విధానాన్ని రూపొందిస్తామని అన్నారు. సిపిఎం 23వ అఖిల భారత మహాసభల ప్రతినిధుల సదస్సు ప్రారంభోత్సవంలో ఏచూరి మాట్లాడారు. ''రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మత ధృవీకరణను ఉపయోగించుకుంటోంది. ప్రమాదకరమైన ఈ మతతత్వాన్నివ్యతిరేకించాలంటే సెక్యులర్ విధానం కావాలి. దీనిపై కాంగ్రెస్ తన వైఖరిని చెప్పాలి. ఆ పార్టీ మతోన్మాదంతో రాజీ వైఖరిని అవలంబిస్తోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఆ పార్టీలన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. బిజెపి మతోన్మాద ధోరణుల పట్ల, దాని దూకుడు పట్ల ఈ పార్టీలు ఏ వైఖరి తీసుకుంటాయో గళం విప్పాలి. బీజేపీ విధానాలకు ప్రత్యామ్నాయం సోషలిజమే. బిజెపిని కేవలం ఎన్నికల్లో ఎదుర్కోవటం ఒక్కటే కాదు; అది సమాజంలో చొప్పిస్తున్న అన్ని ప్రమాదకర హిందూత్వ అజెండాలను తిప్పికొట్టాలి. దేశంలో వామపక్ష పార్టీలు సంఘటిత కార్యాచరణకు ఈ కార్యక్రమం అవసరమైన వేదిక అవుతుంది.'' అని ఏచూరి అన్నారు.
''లౌకికవాద, ప్రజాతంత్ర పార్టీల ఉమ్మడి ప్రయత్నాల ద్వారా బీజేపీని ఓడించవచ్చు. మోడీ ప్రభుత్వం ఇప్పుడు సమాఖ్య హక్కులతో పాటు రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులనూ కాలరాస్తోంది. ప్రాథమిక హక్కులను సైతం నిర్దాక్షిణ్యంగా ఉల్లంఘిస్తోంది. రాజ్యాంగ సంస్థల స్వతంత్ర కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తోంది. మోడీ నియంతృత్వ పాలన మతతత్వశక్తులకు, కార్పొరేట్ శక్తులకు బలాన్నిస్తోంది.'' అని సీతారాం పేర్కొన్నారు.
''మోడీ ప్రభుత్వం కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఎలా విఫలమైందో మనం చూశాం. గంగానదిలో శవాలు ప్రవహించాయి. వలస కార్మికులు ఆకలితో అలమటించారు. వేలాది కిలోమీటర్లు నడిచారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిలబడేది కాదని తేలిపోయింది. కోవిడ్ ప్రబలటానికి ముందే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారొపోతున్న సంకేతాలు కనిపించాయి. కోవిడ్‌తో పరిస్థితి మరింత దిగజారింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ లాభాలను పెంచుకోవాలనేది ఒక్కటే పెట్టుబడిదారీ విధానం లక్షణం, లక్ష్యం. ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఈ వ్యవస్థ అసమర్థతను బహిర్గతం చేసింది. దీనికి భిన్నంగా సోషలిస్టు దేశాలు కోవిడ్‌ని అడ్డుకున్నాయి. తమ ప్రజలకు గొప్ప భరోసాని ఇచ్చాయి. తమ ఆర్థిక వ్యవస్థలను వృద్ధి పథంలో ఉంచగలిగాయి. కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కొన్న తీరు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.
అమెరికా సామ్రాజ్యవాదం కోవిడ్ అనంతర ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని ఏకీకృతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చైనాను 'ఒంటరి' చేసే ఎజెండాతో కొనసాగుతోంది. సామ్రాజ్యవాదం దాని మిత్రదేశాలన్నింటినీ సమీకరిస్తోంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం మొదలై నేటికి 42వ రోజు. నిజానికి ఇది రష్యా - అమెరికా, నాటోల మధ్య యుద్ధం. రష్యా సరిహద్దులో నాటో విస్తరించటానికి చేసిన ప్రయత్నం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ఈ యుద్ధం వెంటనే ముగియాలి. అయితే, ఈ యుద్ధం అంతర్జాతీయంగా అనేక పరిణామాలకు దారితీస్తోంది. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటించటం ద్వారా భారతదేశం తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవాలి. క్వాడ్ వంటి సామ్రాజ్యవాద నేతృత్వంలోని కూటముల నుంచి దూరంగా ఉండాలి.''
''బలమైన పార్టీ నిర్మాణానికి, బలమైన వామపక్ష ఐక్యతకు, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటుకు సీపీఎం తన ప్రయత్నాలను బలోపేతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. హిందూత్వ మతతత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల విస్తృత ఫ్రంట్‌ను ఏర్పరచడానికి, మన రాజ్యాంగ విలువలను రక్షించడానికి, ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య విధానాలను రూపొందించే పోరాటాన్ని బలోపేతం చేయడానికి సీపీఎం అహర్నిశలూ పాటుపడుతోంది. ఇలాంటి కృషి భాగంగా కలిసి పనిచేయడానికి దేశభక్తులందరి సహకారాన్ని కోరుతున్నాం.'' అని ఏచూరి అన్నారు.










