రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 0.03 శాతం మాత్రమేనంటే ఎన్‌డిఎ చావు తప్పిందనిపించుకున్న తీరు తెలుస్తుంది. పైగా ఓట్ల లెక్కింపులో అవకతవకల వల్లనే తమ స్థానాలు తక్కువగా చూపిస్తున్నారని ఆర్‌జెడి, వామపక్షాలు గట్టి ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల వాదోపవాదాలపై ఎక్కడ లేని ప్రచారమిచ్చిన మన మీడియా ఈ ఫిర్యాదులను తేలిగ్గా తీసేస్తున్నది.
సిపిఎం అభ్యర్థుల ఓట్లు
నియోజకవర్గం పేరు అభ్యర్థి ఓట్లు ఓట్ల శాతం
మాంఝి డా||సత్యేంద్ర యాదవ్ 59324 37.56
బిభూతిపూర్ అజయ్ కుమార్ 73822 45.00
మటిహని రాజేంద్ర ప్రసాద్ సింగ్ 60599 29.27
పిప్రా రాజ్ మంగళ్ ప్రసాద్ 80410 40.10
బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆర్భాటంగా నిర్వహించిన బీహార్ విజయోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ రెండు గదుల ఇంటితో బయిలుదేరిన తాము ఈ రోజు దేశం నలు దిశలా గల రాష్ట్రాలలో పాలన చేస్తున్నామని ప్రకటించారు. బీహార్‌తో పాటు వివిధ రాష్ట్రాలలో ఉప ఎన్నికల ఫలితాలతో మరోసారి మోడీ గాలి వీస్తున్నదనే భ్రమ కలిగించడానికి చాలా హడావుడి సాగుతున్నది. ఈ ఫలితాలు బిజెపి కి ఉపశమనం కలిగించవచ్చు గాని ఇవి కరోనాను ఎదుర్కోవడంలో తమ విధానానికి మోడీ ఆమోద ముద్ర చిత్రించుకోవడం రాజకీయ వ్యూహం మాత్రమే.
వాస్తవానికి బీహార్ ఎన్నికల ఫలితాలు బిజెపి ఆర్థిక విధానాలకు, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావనను బలంగా ముందుకు తెచ్చాయి. ఒక వ్యాఖ్యాత అన్నట్టు కరోనా కష్టాలను కర్మ సిద్ధాంతంతో సరిపెట్టుకోవడంగాక రాజకీయ సైద్ధాంతిక పోరాటంగా మారిస్తే నల్లేరు మీద బండిలా నడవకుండా ఆపవచ్చనే విశ్వాసం కలిగించాయి. బీహార్ లోనే బిజెపి అనేక మల్లగుల్లాలతో రెండవ స్థానంలో రాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వంత పార్టీ జెడియు బలం గణనీయంగా తగ్గిపోయింది. పది మంది మంత్రులు ఓడిపోయారు. విజయం ఎన్‌డిఎ అయినా ఎన్నికల స్టార్ మాత్రం తేజస్వి అనేది అక్కడ వినిపిస్తున్న మాట. వామపక్షాలు సత్తా చాటాయనీ, ఎర్రజండా రెపరెప లాడిందని మొత్తం మీడియా అంగీకరించాల్సి వచ్చింది. మహాఘట్‌బంధన్‌లో 70 స్థానాలు తీసుకుని కేవలం 19 మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ఈ పరిస్థితికి ప్రధాన బాధ్యత వహించాల్సి వుంటుందని ప్రతివారూ వేలెత్తి చూపుతున్నారు. 29 స్థానాలు మాత్రమే తీసుకుని 16 గెలిచిన వామపక్షాల గెలుపు శాతం ఇంతకంటే చాలా ఎక్కువగా వుంది. వంద స్థానాలలో వామపక్షాల మద్దతు ఎంతగానో ఉపయోగపడిందని కూడా ఓట్ల లెక్కలు చెబుతున్నాయి. వామపక్షాల పని అయిపోయిందని చప్పరించిన వారికి ఈ ఫలితాలు కనువిప్పు కలిగించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అందుకే అన్నారు.
చావు తప్పిన గెలుపు.. అవకతవక లెక్కింపు !
ఎన్‌డిఎ 2019 ఎన్నికలతో పోలిస్తే 12.4 శాతం ఓట్లు కోల్పోయింది. ఆర్‌జెడి సీట్లలో పెద్ద పార్టీగా రావడమే గాక 23.1 శాతంతో ఓట్లలోనూ ముందుంటే బిజెపి 19.5 శాతానికి పరిమితమైంది. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 0.03 శాతం మాత్రమేనంటే ఎన్‌డిఎ చావు తప్పిందనిపించుకున్న తీరు తెలుస్తుంది. పైగా ఓట్ల లెక్కింపులో అవకతవకల వల్లనే తమ స్థానాలు తక్కువగా చూపిస్తున్నారని ఆర్‌జెడి, వామపక్షాలు గట్టి ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల వాదోపవాదాలపై ఎక్కడ లేని ప్రచారమిచ్చిన మన మీడియా ఈ ఫిర్యాదులను తేలిగ్గా తీసేస్తున్నది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా ఏకపక్షంగా వాటిని తోసిపుచ్చుతున్నారు. 20-30 స్థానాలలో లెక్కింపులో తప్పులు జరిగాయని ఆర్‌జెడి, వామపక్షాల నాయకులు ఉదహరిస్తున్నారు. హిస్లా నియోజకవర్గంలో ఎన్‌డిఎ 12 స్థానాలతో గెలవడం ఇందులో భాగమే. 19 స్థానాలలో మహాఘట్‌బంధన్ అభ్యర్థులకు గెలిచినట్టు చెప్పినా ఆ మేరకు అధికారిక పత్రం ఇవ్వకపోవడంపై వారు నిరసన తెల్పినా పట్టించుకోలేదు. పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు లోనూ అవకతవకలు జరిగాయి. పోస్టల్ బ్యాలట్‌లో అభ్యంతరాల కారణంగా పక్కన పెట్టిన ఓట్ల కన్నా తర్వాత వచ్చిన మెజార్టీ ఓట్ల సంఖ్య ఎక్కువగా వుంటే వాటిని మళ్లీ లెక్కించనవసరం లేదని కమిషన్ రూపొందించుకున్న సూత్రం అశాస్త్రీయమే గాక అభ్యంతరకరం కూడా. కాని జాతీయ మీడియా మొత్తం వాస్తవాలు చెప్పకుండా గతంలో లాలూ హయాంలో సాగిన జంగిల్ రాజ్ భయమే ఓటమికి కారణమైందని చిత్రిస్తున్నది. ఆ జంగిల్ రాజ్ నుంచి నితీష్ మంగళ్ రాజ్ తీసుకొచ్చారని క్రమపద్ధతిలో రూపొందించిన ప్రచారకాండను ప్రజలు గట్టిగా తిరస్కరించిన తర్వాత కూడా ఈ వాదనే వినిపించడం పాక్షికత్వానికి ప్రతిబింబమే. ఎగ్జిట్ పోల్స్‌లో పోటాపోటీగా చెప్పినా మహాఘట్‌బంధన్‌కే విజయం కలుగుతుందని చెప్పాయి. గతంలో ఒక్క యాక్సిస్ పోల్ మాత్రమే ఈ మాట చెబితే ఈసారి అన్నీ అదే చాటాయి. అలా ఎందుకు జరగలేదంటే బీహార్ వెనకబాటు, మహిళా ఓటర్ల ఆధిక్యత, ఎక్కవ పార్టీలు రంగంలో వుండటం వంటి కారణాలు చెబుతున్నారే గాని లెక్కింపులో తప్పులు కూడా కావచ్చని ఒకరైనా చెప్పకపోవడం విచిత్రం.
నితీష్ దిగజారుడు.. వామపక్షాల విధాన నిర్దేశం
2014 ఎన్నికల తర్వాత ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా పోటీదారుగా మాట్లాడిన నితీష్ ఇప్పుడు ప్రత్యేకంగా ఆయనకే ధన్యవాదాలు చెప్పడం ఇందులో తొలి అంకం మాత్రమే. తన సుశాసన్ మోత పక్కనపెట్టి ఎన్నికల ప్రచారంలోనే అడుగడుగునా మోడీనే ముందుకు తేగా ఆ మోడీ పాకిస్తాన్ చైనా అయోధ్య వంటి సమస్యలతో ఉద్వేగం పెంచే ప్రయత్నం చేశారు. బీహార్ వెనకబాటు దేశంలో జాతీయ సగటు 23 శాతం కన్నా రెట్టింపు 46 శాతం వున్న నిరుద్యోగం వంటి వాటిని చల్లగా దాటేసే ప్రయత్నం చేశారు. ఇందుకు భిన్నంగా మహాఘట్‌బంధన్ బీహార్‌లో పరిపాటిగా మారిన కులాలవారి ఎజెండాను మార్చే ప్రయత్నం చేసింది. నిరుద్యోగం మొదటిసారి ప్రధాన సమస్యగా తీసుకొచ్చారు. వామపక్షాల ఉనికి వల్ల ఎజెండా మారిందని పరిశీలకులు గుర్తించారు. గతంతో పోలిస్తే కులాల వారీగా గాక సమస్యల ప్రస్తావన ఎక్కువగా వచ్చింది. ఇవన్నీ కలిసినందునే డబుల్ ఇంజన్‌గా చెప్పుకున్న ఎన్‌డిఎ ను మూడు పదుల తేజస్వి నాయకత్వం లోని కూటమి శక్తివంతంగా నిలవరించింది. ఎన్‌డిఎ నుంచి నిష్క్రమించిన చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జెపి పోటీ వల్ల జెడియు సీట్లు కోల్పోయిందని మరో లెక్క చెబుతున్నారు. నితీష్‌ను దెబ్బ తీయడం కోసం తమ ప్రోద్బలం తోనే ఆ పార్టీ ఇదంతా చేసిందనే ఆరోపణల మధ్య బిజెపి నేతలు చిరాగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ గుజరాత్ లోనూ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వచ్చిన ఎంఎల్‌ఎ లలో అత్యధికులు విజయం సాధించడం బిజెపి ప్రభుత్వాలకు మరింత సుస్థిరత్వం కలిగించింది. యు.పి లోనూ కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇది కూడా కాంగ్రెస్ వైఫల్యం వల్ల జరిగిందే. మజ్లిస్ అయిదు స్థానాలు గెల్చుకోవడం మరో ముఖ్య పరిణామం. దానివల్ల మహాఘట్‌బంధన్‌కు నష్టం కలగలేదని చెబుతున్నా మతపరమైన విభజన పెంచాలనే బిజెపి వ్యూహం నెరవేరడానికి దోహపడింది. ఇంతా చేసి మజ్లిస్ కంటే మహాఘట్ బంధన్ లోనే ముస్లిం ఎంఎల్‌ఎలు ఎక్కువగా (ఎనిమిది మంది) వచ్చారు. బిఎస్‌పి తరపున గెలిచింది కూడా ముస్లిం అభ్యర్థి కావడం విశేషం. బీహార్ లోనే గాక భవిష్యత్తు లోను బెంగాల్, తమిళనాడు ప్రతి చోటా తాము పోటీ చేస్తామని మజ్లిస్ నాయకుడు ఒవైసీ అనడం యాదృచ్ఛికం కాదు. మత రాజకీయాల మతలబులు దీంతోనే తెలుస్తున్నాయి.
భవిష్యత్ దర్శనం
ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడమే పరమార్థంగా భావించే నితీష్ కుమార్ ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనడంలో సందేహం లేదు. దళితులు, అత్యంత వెనకబడిన తరగతులు ఇంకా జెడియు బిజెపి ప్రభావం నుంచి బయిటకు రాకపోవడం ఇందుకో కారణం. వామపక్షాలకు పునాది వున్నచోట వారిని సమీకరించగలిగినా మొత్తంపైన ఆ పరిస్థితి లేదు. జెడియు స్థానాలు తక్కువైనా నితీష్ కుమార్‌నే ముఖ్యమంత్రిని చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నట్టు బిజెపి చెబుతున్నది. అయితే బలం లేకున్నా పదవి కోసం వేళ్లాడటంపై ఆ పార్టీ లోనే అసంతృప్తి వుంది. ఎంఎల్‌ఎ మనోహర్ ఝా ఈ విషయమై బహిరంగంగానే చీదరించుకున్నారు. పెద్ద పార్టీగా వచ్చిన తేజస్వి యాదవ్ ఆర్‌జెడి ని బలపర్చవలసిందిగా కాంగ్రెస్ నాయకుడు దిగ్విజరుసింగ్ మరో పిలుపునిచ్చారు. ఇవేవీ జరక్కపోయినా నితీష్ కుమార్ జూనియర్ భాగస్వామిగా బిజెపి దయతో ఆయన ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టాలి. 2015లో ఆర్‌జెడి తో కలసి గెలిచి మధ్యలో ప్లేటు ఫిరాయించి ఆ బిజెపితో కలసిన నితీష్ అవకాశవాదం చెరిగిపోదు. బిజెపితో కలిసి వుంటూనే ఎత్తుగడగా ఎన్‌ఆర్‌సి కి వ్యతిరేకంగా తీర్మానం చేయించిన నితీష్ ఇప్పుడు హిందూత్వ ఎజెండాకు అక్షరాలా అమలు చేయవలసి రావడం అనివార్యం. తాను ముఖ్యమంత్రి పదవి కోరలేదని ఎన్‌డిఎ నిర్ణయం తీసుకుంటుందని నితీష్ ప్రకటించారు. ఇవే చివరి ఎన్నికలు అని ప్రతి సభ లోనూ తాను చెబుతుంటానని, కాని ఆసారి దానికి ఎక్కువ ప్రచారం వచ్చిందని అంటూ తప్పుకోవడంలేదన్న సంకేతం ఇచ్చారు. అయినా సరే ముఖ్యమంత్రిగా ఆయన పూర్తికాలం వుంటారా అన్నదానిపై అనుమానాలు వున్నాయి. ఇందుకు బిజెపి కుటిల వ్యూహాలు ఒక కారణమైతే పెద్ద పార్టీగా వున్న ఆర్‌జెడి అవకాశాలు మరో కారణం.
బీహార్ శాసనసభలో సిపిఐ (ఎంఎల్), సిపిఎం, సిపిఐ లకు సముచిత ప్రాతినిధ్యం వుంటుంది గనక సమస్యల పరిష్కారంపై చర్చలు కేంద్రీకరింపచేసి కుల మత రాజకీయాలకు పగ్గాలు వేసే ప్రయత్నం చేయగలుగుతాయి. అంతేగాక ఈ అనుభవంతో మిగిలిన చోట్ల మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీలను ఐక్యం చేసే కృషికి ఊతం లభిస్తుంది. బీహార్‌లో 70 స్థానాలు తీసుకుని 19 మాత్రమే గెలిచి మహాఘట్‌బంధన్ గెలుపును దెబ్బ తీసిన కాంగ్రెస్ నిర్వాకం ఇతర చోట్ల ఆ పార్టీ గాని ఇతరులు గాని ఇలాంటి పోకడలు పోకుండా ఒక హెచ్చరికగా వుంటుంది. ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరి పైనా పోరాటం కొనసాగించవలసి వుంటుంది.
- తెలకపల్లి రవి











