హిందూపురం : హిందూపురం పురపాలక పాలక వర్గం తమకు ఆదాయం వచ్చే అజెండాపై కనీస చర్చ లేకుండా అమోదం తెలుపుతోందన్నా ఆరోపణలు వినపిస్తున్నాయి. అందుకు పురపాలక సంఘ ఆధీనంలో ఉన్న కూరగాయాల పెద్ద మార్కెట్ గత సంవత్సరం నుంచి తగ్గుతున్న ఆదాయమే నిదర్శనం. రెండు రోజుల క్రితం పెద్ద కూరగాయాల మార్కెట్ బహిరంగ వేలంలో పురపాలక సంఘానికి రూ.26వేలు ఆదాయం వస్తే....అధికార పాలక వర్గానికి రూ.10లక్షలు ముట్టినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. హిందూపురం పురపాలక సంఘ ఆధీనంలో ఉన్నా పెద్ద కూరగాయాల మార్కెట్‌తో పాటు పెద్ద, చిన్న పశువులు, వాటి తోళ్ల మార్కెట్, పరిగి బస్టాండ్‌లో ఉన్న ఖాళీ స్థలానికి బహిరంగ వేలాన్ని వేశారు. ఈ బహిరంగ వేలంలో పుపాలక సంఘానికి భారీగా ఆదాయం వచ్చేది. అయితే గత రెండు సంవత్సరాల నుంచి పరిశీలన చేస్తే పురపాలక సంఘానికి గండి పడినట్లు తెలుస్తోంది. గతంలో బహిరంగ వేలం వేసిన వాటిని పరిశీలన చేస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో పెద్ద కూరగాయాల మార్కెట్‌ను అధికారులు రూ. 37.32లక్షలతో వేలం వేస్తే రూ.45లక్షలకు రమేష్ అనే పాట దారుడు దక్కించుకున్నారు. 2020-2021 కరోన విపత్కర సమయంలో సైతం రూ.34.26లక్షలతో వేలం వేయగా రూ.43.68లక్షలకు పోయింది. ప్రస్తుతం ఉన్నా పాలక వర్గం ఏర్పడిన అనంతరం బహిరంగ వేలంలో పాల్గోనే వారందరు సిండికేట్‌గా మారుతున్నట్లు సమాచారం. 2021-22వ ఆర్థిక సంవత్సరంలో ఇదే మార్కెట్‌ను రూ.48.67లక్షలతో వేలం వేయగా ఎవరు ముందుకు రాకపోవటంతో వేలం రద్దు చేశారు. అధికారులపై ఒత్తిడి తీసుకోచ్చి రూ.40లక్షలతో వేలం వేయగా రూ.43.02లక్షలకు ఆన్వర్ ఖాన్ అనే పాట దారుడు దక్కించుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మూడు సంవత్సరాల సగటున తీసుకుని రూ.43లక్షలతో వేలం వేశారు. అయితే మళ్లీ పాటదారులు అందరు కలిసి సిండికేట్‌గా మారి బహిరంగ వేలంలో పాల్గొనకుండా మార్కెట్ ధరను తగ్గించాలని కోరారు. దీంతో పురపాలక సంఘానికి ఎక్కువ ఆదాయం వచ్చే పెద్ద కూరగాయాల మార్కెట్‌తో పాటు పరగి బస్టాండ్‌లో ఉన్న ఖాళీ స్థలం వేలం పాటను రద్దు చేశారు. పాలక వర్గం మళ్లీ అధికారులపై ఒత్తిడి తెచ్చి పెద్ద కూరగాయాల మార్కెట్‌ను 37లక్షలకు కెసి శ్రీరామిరెడ్డికి అప్పగించారు. చివరకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబందించి గత మూడు రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట జరిగింది. పెద్ద కూరగాయాల మార్కెట్‌ను మూడు సంవత్సరాల సగటున తీసుకుని అధికారులు రూ.41.23లక్షలతో వేలం వేయగా రూ.26వేల ఆదాయంతో కేవలం రూ.41.49.999లకు అస్మాబాను అనే వ్యక్తి దక్కించుకున్నారు. దీనిని కౌన్సిల్ ఆమోదం తెలపాలంటే పాలక వర్గానికి రూ.15లక్షలు డీల్ కుదిరినట్లు అరోపణలు వినపిస్తున్నాయి. అయితే గుత్తేదారులు అంత ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో కనీసం రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వినపిస్తున్నాయి. ఇలా పాలక వర్గం ఏర్పడినప్పటి నుంచి వారి సొంత లాభం చూసుకుంటు పురపాలక సంఘానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారన్నది ఈ లెక్కలే చెబుతున్నాయి. ఇదే కాకుండా గత ఏడాది నుంచి జరుగుతున్న మున్సిపల్ వాణిజ్య భవనం, కూరగాయాల మార్కెట్, హోల్‌సేల్ కూరగాయాల వ్యాపారులకు కేటాయిస్తున్న స్థలంతో పాటు చివరకు ఆకుకూరల వ్యాపారాలు చేసుకునే వారితో సైతం ప్రతి కౌన్సిలర్ లక్షలాది రూపాయలు తీసుకుని స్థలాలు, గదులు కేటాయించినట్లు ఆరోపణలు వినపిస్తున్నాయి. దీంతో పాటు పరగి బస్టాండ్‌లో ఉన్నా రాజీవ్ మెమోరియల్ ట్రస్టు వాణిజ్య గదులు సైతం చాల తక్కువ అద్దెలతో పాలక వర్గం గుత్తేదారులకు కట్టబెట్టినట్లు వార్తలు వినపిస్తున్నాయి.










