బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో సిపిఎం
ప్రజాశక్తి-కావలి : కావలి డిప్యూటీ సబ్ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయంలో శనివారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎ.పి.ఇ.ఆర్.సి) జరిపిన ఆన్‌లైన్ విద్యుత్ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో సిపిఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెలా విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన, అన్ని కేటగిరీల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు విధించి తద్వారా ప్రజలపై రైతులపై విద్యుత్ భారాలను మోపాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇక విద్యుత్ నియంత్రణ మండలి ఎందుకని సెకీ ద్వారా ఆదానీ కంపెనీలతో చేసుకున్న 7వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. డిస్కమ్ము ప్రతిపాదించిన లోటు రూ.12,927 కోట్లను ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో రైతులు, ప్రజలపై, భారాలు మోపకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా టారిప్, పెంపు, శ్లాబులు మార్పిడి ఫిక్స్‌డ్ ఛార్జీలు, ఇంకా తదితర రూపాలలో వినియోగదారులపై ప్రభుత్వం భారాలు మోపిందన్నారు. ముఖ్యంగా ఎస్‌సి ఎస్‌టిలకు 200 యూనిట్లు వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌కు కోతలు పెట్టిందన్నారు. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అర్హత ఉన్న వారందరికీ ఉచిత విద్యుత్తు కొనసాగించాలన్నారు. ఎపి జెన్కో కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటును రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటికరించేందుకు పూనుకొన్నదని దీనివల్ల ప్రజలపై విద్యుత్ భారాలు పడే అవకాశం ఉన్నదన్నారు. ఎపి జెన్కోను ప్రయివేటుకరించే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ట్రూ ఆప్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలను పెంచకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజనల్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.










