Feb 28,2022 21:59

న్యూఢిల్లీ : ఆదివారం జరిగిన పశ్చిమబెంగాల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో చెలరేగిన హింసను సిపిఎం తీవ్రంగా ఖండించింది. పార్టీ పొలిట్‌బ్యూరో సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. ఈ ఎన్నికలు ఓ ప్రహసనంలా తయారయ్యాయని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు కావడంతో మెజారిటీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. రిగ్గింగ్‌ జరిగిన తీరు ఎంత దారుణంగా వుందంటే, పరిస్థితి తమ అదుపులో లేకుండా పోయిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రతినిధే వాపోయారు. పోలింగ్‌ సందర్భంగా హింస చెలరేగడం, ఓటర్లను అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురిచేయడం, పోలింగ్‌ ఏజెంట్లు, అభ్యర్ధులపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడం వంటి ఘటనలు మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, పోలీసు బలగాలు పూర్తిగా రాజకీయమయమైన తరుణంలో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరగడం సాధ్యం కాదని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
కొన్నిచోట్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ నిస్సిగ్గు, దురాక్రమణ చర్యలను సవాలు చేస్తూ, ప్రతిఘటించిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్య భావజాలం కలిగిన పౌరులను సిపిఎం అభినందించింది. టిఎంసి నేతృత్వంలోని ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు పోరాడుతున్న వారికి తమ సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించాల్సిందిగా దేశవ్యాప్తంగా గల ప్రజాస్వామ్య భావజాలం కలిగిన ప్రజలకు సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.

  • ఎస్‌ఇసికి లెఫ్ట్‌ ఫ్రంట్‌ వినతి, ఆందోళన

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌, బూత్‌ల స్వాధీనం తదితర అవకతవకలు జరిగాయని, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. కోల్‌కతాలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి, అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎన్నికల అధికారులను కలిసిన వారిలో ఎల్‌డిఎఫ్‌ ఛైర్మన్‌ బిమన్‌బసు, సూర్యకాంత మిశ్రా, కల్లోల్‌ మజుందార్‌, రాబిన్‌ దేవ్‌ తదితరులు ఉన్నారు.