ప్రజాశక్తి- తాళ్లరేవు బాల్య వివాహాలను నిరోధించాలని ఐసిడిఎస్ పీడీ కొండ ప్రవీణ అన్నారు. బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కలిగించడానికి మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపిపి రాయుడు సునీత గంగాధర్ ప్రారంభించారు. ఎంపిడిఒ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు విద్యార్థులు, అంగన్వాడీ వర్కర్లు, అధికారులు ర్యాలీగా వెళ్లి సంతపేట సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ కె.ప్రవీణ, ఎంపిపి రాయుడు సునీత మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. చిన్న వయసులో వివాహాలు జరగడం వల్ల శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉందని, వాటిని నిరోధించడానికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, ఎంపిడిఒ ఎం.అనుపమ, ఇఒపిఆర్‌డి ఎం.బైరమూర్తి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్, సిడిపిఒ మాధవి పాల్గొన్నారు.










