బద్వేలు/గోపవరం : బద్వేల్‌ని బ్రహ్మాండంగా అభివద్ధి చేస్తారని వైసిపిని భారీ మెజారిటీతో గెలిపించారని, ఇక్కడ అభివృద్ధి నిల్ అని, భూకబ్జాలు ఫుల్ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 124 రోజుకు చేరుకుంది. సోమవారం బద్వేలు నియోజకవర్గం బద్వేలు మండలంలోని విద్యానగర్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమై ఎన్‌జి.కాలనీ, సిఎస్‌ఐ చర్చి, ఆర్‌టిసి బస్టాండ్, నాలుగు రోడ్ల కూడలి, పోరుమామిళ్ల బైపాస్, గోపవరం మండలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి శ్రీనివాసపురం, పిపి కుంట విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, క్రిష్టియన్లు, ఎస్‌సి సామాజిక వర్గీయులు, స్థానికులతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా బద్వేలు ఆర్‌టిసి బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ బద్వేల్ ఎమ్మెల్యే స్థలాన్నే వైసిపి నాయకులు కబ్జా చేసారంటే ఉమ్మడి కడప జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జా చేశారన్నారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బద్వేల్‌ని మండలాల వారీగా కేకులా కోసి బంధువులకు పంచేశారన్నారు. గోవిందరెడ్డి, వైసిపి నేతలు రమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, గురు మోహన్, శ్రీరాములు, పోల్‌రెడ్డి, ఎల్లారెడ్డి కలిసి రెండు వందల కోట్లు విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కొట్టేశారని పేర్కొన్నారు. ఆర్డీవో వెంకటరమణ 40 మంది వైసిపి నాయకుల లిస్ట్ బయటపెట్టారని తెలిపారు. వైసిపి నాయకుల్ని తప్పించి అనామకులపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారని చెప్పారు. వైసిపి నేతలు యోగానందరెడ్డి, వెంకటరెడ్డి, పిచ్చిరెడ్డి పోరుమామిళ్ల-బద్వేల్ రోడ్డు పక్కనే ఉన్న రూ.150 కోట్ల విలువైన 200 ఎకరాలు ఆక్రమించారని తెలిపారు. పోరుమామిళ్లలో ఫుడ్ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మేశాడన్నారు. కలసపాడు వైసిపి నేత గురివిరెడ్డి ఆసుపత్రి భూమినే లేపేశాడన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో ఏ అభివద్ధి కార్యక్రమం జరగాలి అన్నా చైర్మన్ రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టర్లు 23 శాతం కప్పం కట్టాల్సిందేని, అందుకే కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే చేతులు ఎత్తేశారని పేర్కొన్నారు. జగన్ బద్వేల్, గోపవరం, అట్లూరు మండలాలకు సోమశిల బ్యాక్ వాటర్ వద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చాడన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి పోరుమామిళ్ల, కలసపాడు మండలాలకు రెండేళ్లలోనే సాగు, తాగునీరు అందిస్తాం అని చెప్పి మోసం చేసాడని పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగు నీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చాడన్నారు. నాలుగేళ్లు నిద్రపోయాడని ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగస్తులను మోసం చేయడానికి కొత్త డ్రామా మొదలు పెట్టారని తెలిపారు. ప్రజల్ని హింసిస్తే పులకేశి జగన్‌కి మజా వస్తుందన్నారు. సిఎం గా ప్రమాణస్వీకారం చేస్తూ కరెంట్ బిల్లులు తగ్గించేస్తానని, వందల్లో బిల్లు వచ్చే వారికి వేలల్లో వస్తోందని పేర్కొన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడన్నారు. స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు అంటూ బాదుడే బాదుడని తెలిపారు. ఇసుక వ్యాపారంలో జగన్ బంధువు వీరారెడ్డి మోసం చేసాడని పోరుమామిళ్లకు చెందిన నారాయణ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసాడని పేర్కొన్నారు. ప్రతి రోజు ఇసుక అక్రమ రవాణాలో జగన్ వాటా రూ.3 కోట్లన్నారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారని విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడని ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని తెలిపారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అని చెప్పాడన్నారు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కొట్టేశారని పేర్కొన్నారు.. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేశారన్నారు. జాబ్ కేలండర్ ప్రకటించలదేని తెలిపారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు. ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. గ్రూప్-2 లేదని, డిఎస్‌సి లేదని, ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేశారని పేర్కొన్నారు. జిఒ 77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పధకం రద్దు చేసాడన్నారు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తామన్నారు. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తామని, అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లని తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3గా ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2గా ఉందని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మాదన్నారు.బద్వేలు బహిరంగ సభలో మాట్లాడుతున్న నారా లోకేష్










