అనంతపురం ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ అనంతపురం జిల్లాకు మరోసారి నిరాశను మిగిల్చింది. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎప్పటిలాగానే అరకొర నిధులనే కేటాయించింది. ఇక రైల్వేకు సంబంధించి కొత్త రైళ్లు ఏవీ రాలేదు. గుంతకల్లు డివిజన్‌కు ఎన్ని నిధులు కేటాయించారన్నది ఇంకా స్పష్టత రాలేదు. పింకు బుక్కు వస్తే డివిజన్ పరిధిలో నిధుల కేటాయింపులపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఏది ఏమైనా ఈ బడ్జెట్‌లో వెనుకబడిన అనంతపురం జిల్లాకు అన్యాయమే మిగిల్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మొండి చేయి
విభజన హామీలో భాగంగా అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఈ ఏడాది నిధుల కేటాయింపులు మొక్కుబడిగానే జరిగాయి. గతేడాది కూడా కేటాయించినది తక్కువే అయినా అందులోనూ విడుదల చేసింది మరింత తక్కువనే చెప్పాలి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.56.6 కోట్లు కేటాయించారు. కాని సవరణ బడ్జెట్‌లోకి వచ్చే సరికి ఆ నిధులు కేవలం 13.08 కోట్లకు తగ్గిపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి చూస్తే రూ.47.40 కోట్లు కేటాయించారు. ఇందులో విడుదలయ్యేది ఎంతన్నది ప్రశ్నార్థకమనే చెప్పాలి. ఇప్పటికే కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపులు జరపకపోవడం గమనార్హం.
పక్కనున్న భద్రకు రూ.5300కోట్లు కేటాయింపు...
జిల్లాకు పక్కనున్న కర్నాటక రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరుతో తుంగభద్ర డ్యామ్‌పై కర్నాటక నిర్మిస్తున్న భద్ర డ్యామ్‌కు రూ.5300 కోట్లు నిధులను కేటాయించింది. తుంగభద్రపై జరుగుతున్న ఈ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్‌లో అభ్యంతరాలున్నాయి. ప్రధానంగా తుంగభద్ర డ్యామ్‌పై ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో నీరు రావడం ఆలస్యమయితే తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు నీటి విడుదలపై ప్రభావం పడుతుంది. ఇది ఆలస్యమయితే అనంతపురం జిల్లాకు తాగునీటి ఇక్కట్లు తప్పవు. ఇటువంటి ప్రాజెక్టుకు కర్నాటక ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే ఇదే సమయంలో అనంతపురం జిల్లాకు మరోరూపంలో నీరందించే హంద్రీనీవాను పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుంతకల్లు రైల్వే డివిజన్‌కైనా నిధులు పెరిగాయా ?
దక్షిణ మధ్య రైల్వేలో ప్రధానమైన డివిజన్‌లో గుంతకల్లు ఒకటి. దీనికి నిధుల కేటాయింపులు ఏ మేరకన్న దానిపై స్పష్టత లేదు. కొత్త రైళ్లు అయితే ఏవీ ఈ ప్రాంతానికి కేటాయించలేదు. ఇక అభివృద్ధికి నిధులు ఎన్ని కేటాయించారన్నది స్పష్టత రావాలంటే పింక్ బుక్ రావాల్సి ఉంటుంది. అది వస్తేగానీ ఈ ప్రాంతంలో కొత్తలైన్లు, పాత లైన్లకు నిధులు ఎన్ని కేటాయించారన్నది తెలియదు.










