కాలువలోకి బోల్తాపడ్డ స్కూల్ బస్సు
ప్రజాశక్తి - కనగానపల్లి : మండలంలోని బద్దలాపురం సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్ధి తీవ్ర గాయల పాలయ్యాడు. మరో 14మంది విద్యార్థులు ప్రమాదం నుండి బయట పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు... తగరకుంట గ్రామంలోని రోహిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి 15మంది విద్యార్థులతో స్కూల్ బస్సు నర్సంపల్లికి వెళ్తోంది. మార్గ మధ్యలో బద్దలాపురం సమీపంలో హంద్రీ నీవా కాలువ వద్దకు రాగానే అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమర్ అనే మూడవ తరగతి విద్యార్ధికి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగిలిన 14 మంది విద్యార్థులు ప్రమాదం నుండి బయట పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి గాయపడిన విద్యార్థిని తగరకుంట ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కనగానపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.










