Jan 08,2023 18:52

బౌద్ధ ఆరామాలు

పట్టని పురావస్తు శాఖ అధికారులు
శిధిలమవుతున్న ఆరామాలు
పురాతన కట్టడాలను కూల్చివేస్తున్న దుండగులు
ప్రజాశక్తి-నందలూరు: రాయలసీమకే తలమానికమైన నందలూరు మండలంలోని ఆడపూరు ముక్తికనుమ వద్ద ఉన్న ప్రాచీన బౌద్ధరామాలకు రక్షణ కరువైంది. ఆరామాలు శిథిలావస్థకు గురవుతున్నాయి. బౌద్ధరామాల గుట్టపై గుప్త నిధులు తవ్వకాల ముఠా కళ్ళు పడ్డాయి. పురాతన కట్టడాలు ఉండడంతో ఇక్కడ గుప్త నిధులు ఉంటాయన్న దురాశతో విధ్వంశానికి దిగుతున్నారు. చారిత్రక సంపదను రక్షించాల్సిన పురావస్తు అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో భావితరాలకు బౌద్ధ ధర్మం ఔన్నత్వాన్ని చాటుతున్న చారిత్రాత్మక కట్టడాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట నిధులు విడుదల చేస్తున్న అధికారులు మాత్రం రక్షణ చర్యలు చేపట్టడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రహదారి కంప చెట్లతో మూసుకుపోయి పర్యాటకులకు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. ఆరామాలు ఉన్న ప్రాంతం అపరిశుభ్రం ముళ్ళ పొదలతో నిండి ఉంది. దీంతోపాటు గతంలో మంజూరు అయ్యిన నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆడపూరు కనుమ వద్ద క్రీ,శ ఒకటి- రెండు శతాబ్దాల మధ్య బౌద్ధ పర్యాటకులు, ప్రచారకులు నివసించేవారు. చెయ్యేరు నది తీరంలోని గుట్టపై అప్పట్లో వారు నిర్మించుకున్న ఆరామాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మిగతా కట్టడాలు మాత్రం శిథిలమయ్యాయి. ఇక్కడ ఒక మహా స్థూపం, 21 స్మారక స్తూపాలు (ఆరామాలు) ఉన్నాయి. అందులో కొన్ని ఆరామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఓ ఆరామాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. మరి కొన్నింటిలో తవ్వకాలకు ప్రయత్నించారు. ఈ బౌద్ధ క్షేత్రాన్ని అభివ ద్ధి చేయటానికి పర్యాటకుల అతిథి భవనాల కోసం ప్రభుత్వం రూ.1.30 కోట్లు మంజూరు చేసింది. ఆరామాల గుట్ట పక్కనే ఉన్న పర్యాటకుల అతిథి భవనంలో బుద్ధిని విగ్రహం, ధ్యాన మందిరం, ఉద్యానవనం, సమాచార కేంద్రం, ఫుడ్‌ కోర్ట్‌ తదితర భవనాల నిర్మాణాలను ప్రభుత్వం నిర్మించింది. కానీ నాలుగు సంవత్సరాలు గడిచిన ప్రారంభానికి నోచుకోలేదు. పక్కనే ఉన్న బౌద్ధ రామాల రక్షణను మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో దుండగులు చారిత్రాత్మక నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఈ బౌద్ధ రామాల వద్ద కాపలాదారున్ని నియమించారు. ఎందుకనో ఆ తరువాత తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా కాపలాదారుడు లేకపోవడంతో అక్రమ తవ్వకాలకు, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపట్టి పర్యాటకులకు సౌకర్యంగా మార్చాలని స్థానికులు కోరుకుంటున్నారు.