Jan 01,2023 09:23

నూతన సంవత్సరం

          అనంతపురం ప్రతినిధి : 2022 సంవత్సరంలోని చేదు, తీపి జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ కొంగొత్త ఆశలతోనూ ఆశయాలతో 2023కు స్వాగతం పలికారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే కార్యక్రమాలు శనివారం రోజు ఉత్సహపూరితంగా జరిగాయి. అర్థరాత్రి 12 గంటలకు కొత్త సంత్సరానికి స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున కేకులు, మిఠాలను కొనుగోళ్లతో శనివారం మధ్యాహ్నం నుంచి నగరాలు, పట్టణాల్లో సందడి నెలకొంది. సాయంత్రం నుంచి స్నేహితులు, సన్నిహితులు వారికి అనువైన ప్రాంతాల్లో వీడ్కోలు సంబరాలు జరుపుకున్నారు. అర్థరాత్రి 12 గంటలకు కేకులు కట్‌ చేసి కొత్త ఏడాది స్వాగతం పలికే కార్యక్రమాలు జోరుగా సాగాయి.
పెద్దగా కలసిరాని 2022
నిన్నటితో ముగిసిన 2022 సంవత్సరం పెద్దగా కలసిరాలేదనే చెప్పాలి. 2021 తరహాలో కోవిడ్‌ 2022 పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడం సంతోషించదగ్గ అంశంగా చెప్పుకోవచ్చు. అనేక ఆంక్షల నడుమనే 2022 సంవత్సర వేడుకలు జరిగాయి. కాని ఆ తరువాత కోవిడ్‌ ప్రారంభం తగ్గింది. అంతక మునుపు కోవిడ్‌ సమయంలో విధించిన లాక్‌డౌన్‌ల కారణంగా మొదలైన ఆర్థిక కష్టాలు సామాన్యులను ఈ ఏడాది వెంటాడాయి. దీంతో అనేక మంది చిరు వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆ బాధలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం ప్రారంభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని ఆర్థిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఈ ప్రభావాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సంవత్సరంలోనైనా ఆర్థిక ఇబ్బందులు తొలగి తిరిగి సామాన్యుడి జీవనం పట్టాలెక్కుతుందన్న ఆశాభావం అందరిలోనూ ఉంది.
అధిక వర్షాలతో రైతుకు తీరని నష్టం
ఈ ఏడాది ప్రకృతి తోడ్పాటు అందించినట్టు కనిపించింది. వర్షాలు బాగాపడినప్పటికీ అధిక వర్షాలతో రైతులకు తీరని నష్టమే మిగిలింది. వర్షం కోసం ఎప్పుడూ ఆకాశం వైపు ఎదురు చూసే జిల్లా రైతాంగానికి 2022లో అధిక వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా సాధారణ వర్షపాతం 459 అయితే ఈ ఏడాది 647 మిల్లీమీటర్లు నమోదయ్యింది. సత్యసాయి జిల్లా సాధారణ వర్షపాతం 527 మిల్లీమీటర్లు అయితే పడిన వర్షపాతం 789 మిల్లీమీటర్లు రెండు జిల్లాలోనూ సాధారణం కంటే 40 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలతో గతంలో ఎన్నడూలేని విధంగా అన్ని ప్రాజెక్టులు పొంగి ప్రవహించాయి. సుమారు వంద టిఎంసిల వరకు నీరు జిల్లా నుంచి వరద రూపంలో దిగువకు పోయింది. ఎప్పుడూ ప్రాజెక్టుల్లో నీళ్ల కోసం ఎదురుచూసేవాళ్లు. ఈసారి మాత్రం పెన్నా, చిత్రావతి నదులు సైతం పొంగి ప్రవహించాయి. ఈ అధిక వర్షాలతో వేరుశనగ, పత్తి, మిరప పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రాజకీయ వేడి
2022 రాజకీయ వాతావరణం వాడీవేడిగానే సాగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు సాగాయి. టిడిపి, వైసిపి నేతల మధ్య మాటల యుద్ధాలు సాగాయి. తాడిపత్రి, రాప్తాడు, రాయదుర్గం, కళ్యాణదుర్గంల్లో ఇవి తారా స్థాయిలో నడిచాయి. హిందూపురంలో రామకృష్ణారెడ్డి హత్య వైసిపిలో గ్రూపు తగాదాలను బయటపెట్టాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్‌పైనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియోలు రాష్ట్ర స్థాయిలో దుమారం రేపాయి. ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంత రాజకీయ వాతావరణం వేడెక్కింది.
తగ్గిన నేరాలు
రెండు జిల్లాల పరిధిలో నేరాల సంఖ్య ఈఏడాది తగ్గినట్టు ఎస్పీలు డాక్టర్‌ కె.ఫక్కీరప్ప, రాహుల్‌దేవ్‌ సింగ్‌లు తెలిపారు. నేరాల సంఖ్య తగ్గినప్పటికీ మహిళలపై హింస శాతం మాత్రం తగ్గలేదు. మరింత పెరిగింది. అదే సమయంలో సైబర్‌ నేరాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. రహదారి ప్రమాదాలు తగ్గాయి. ముఠా కక్షలు కూడా ఈ సంవత్సరం చోటు చేసుకోకుండా పోలీసు శాఖ గట్టి చర్యలు చేపట్టింది.
రెండు జిల్లాల ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం 2022వ సంవత్సరంలో జిల్లాల విభజన చేపట్టింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా రెండుగా ఏర్పాటైంది. అనంతపురం జిల్లాగా 31 మండలాలతో ఏర్పాటవగా, సత్యసాయి జిల్లా 32 మండలాలతో ఏర్పాటైంది. మార్చి నెల నుంచి ఈ విభజన జరిగి ఆయా ప్రాంతాల నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. కొత్త జిల్లా ఏర్పాటైనప్పటికీ ఇప్పటికీ అనేక బలారిష్టాలు మాత్రం కొత్త జిల్లాకు తొలగలేదు. పూర్తి స్థాయి కార్యాలయాల ఏర్పాట్లు పూర్తవలేదు. ఉన్న అరకొర సౌకర్యాలతోనే అక్కడి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.