బెంగళూరు : తన పొలంలోని బావి కనిపించడం లేదని, వెతికి పెట్టాలని కోరుతూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో అవాక్కవ్వడం పోలీసుల వంతైంది. వివరాల్లోకి వెళితే మావిన హోండ గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..తన పొలంలో బావి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తొలుత మతలబు ఉందని భావించిన పోలీసులు... దీనిపై ఆరా తీయగా పంచాయతీ అధికారుల నిర్వాకం బయటపడింది. అతడి పొలంలో బావి తవ్వినట్లు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు పంచాయతీ అధికారులు. బావి తవ్వించుకున్నందుకు తీసుకున్న రుణం చెల్లించాలంటూ ఇటీవల మల్లన్నకు నోటీసు రావడంతో...అసలు విషయం బయటపడింది.










