- గుర్రం జాషువా కళా ప్రాంగణం పనులు పూర్తి చేయాలి
- మండలిలో సభ్యుల డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అనంతపురం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టాలని, ముఖ్యంగా అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని స్వతంత్ర ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాల్య వివాహాలను అరికట్టాలనే అంశంపై మండలిలో జరిగిన చర్చలో మాట్లాడారు. ఈ విషయంపై రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో 18 బాల్య వివాహాలను నిరోధించామ న్నారు. వివాహాల నిషేధిత చట్టంపై డివిజనల్ స్థాయి వర్క్‌షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరులోని గుర్రం జాషువా కళా ప్రాంగణం భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు చేసిన పనులకు గానూ కాంట్రాక్టరుకు రూ.63.72 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచాయని, తక్షణమే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, జాషువా కళా ప్రాంగణాన్ని త్వరితగతిన పూర్తి చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు రూ.3 కోట్లు మంజూరు చేశామని, తక్షణమే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీశైలంలో మాదిగ సామాజిక వర్గానికి సత్రం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందా? అని వైసిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అడిగిన ప్రశ్నకు దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ టిడిపి హయాం నుంచి అడుగుతున్నా అప్పటి ప్రభుత్వం స్పందించలేదని, స్థలం కేటాయించాలని సిఎం జగన్ చెప్పారన్నారు. వైసిపి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పెద్దల సభ ఔన్నత్యాన్ని కాపాడాలన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, అంగన్‌వాడీలకు 11వ పిఆర్‌సి ప్రకారం జీతాలివ్వాలని, గ్రాట్యూటీ రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. జాబ్ కేలండరు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అవుట్‌సోర్సింగ్ కార్మికులపై చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, మున్సిపల్ అవుట్‌సోర్సింగ్ కార్మికులకు 2022 జనవరి 17 నుంచి వేతనాలను రూ.21 వేలకు పెంచినట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చలో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 10,778 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు సంబంధించి 13 రకాల సేవలు అందుతున్నాయన్నారు. 2020 ఖరీఫ్ నుంచి సిఎంఎపిపి ద్వారా కనీస మద్దతు ధర సేకరణ కార్యకలాపాలను ప్రారంభించామన్నారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, నూనెల ధరలను అదుపు చేసేందుకు ఈనెల 15న రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 229 కేసులను బుక్ చేసి 54,145 మెట్రిక్ టన్నుల వంట నూనె నిల్వలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
కిడ్నీ బాధితులను ఆదుకోవాలి : కెఎస్ లక్ష్మణరావు
కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో వందలాది మంది కిడ్నీ వ్యాధి గ్రస్తులుగా మారారని, వారిని వెంటనే ఆదుకోవాలని జీరో అవర్‌లో పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, సమస్య పరిష్కారానికి ఆ గ్రామాలకు రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయటానికి డిఎస్‌సి, టెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు ఐదు వేలకు వరకు ఉన్నాయని, నోటిఫికేషన్ విడుదల చేయాలని కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.










