పరిస్థితి విషమం
మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలింపు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఆరేళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంగళవారం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. నలంద పాఠశాలలో ఎల్‌కెజి చదువుతున్న ధనుష్ ఇంటికెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిచ్చికుక్క దాడిలో ధనుష్ తీవ్రంగా గాయపడటంతో బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లగా ధనుష్ తన బాబాయి వద్ద ఉంటున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఎం.జనార్దన్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పిచ్చికుక్కను గుర్తించి చంపేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మున్సిపాలిటీ పరిధిలో కుక్కల పైన ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. మూడు, నాలుగు నెలల నుంచి రాజంపేట పట్టణ వ్యాప్తంగా కుక్కల సంతతి పెరిగి అధిక సంఖ్యలో పట్టణ వీధుల్లో సంచరిస్తూ కాటు వేసి అనేకమందిని గాయపరిచిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడే స్థితిలో స్వైరవిహారం చేస్తున్నా అధికారులలో స్పందన లేదు. ప్రస్తుత ఘటనతో అధికారులు అప్రమత్తమై కుక్కలపైన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ప్రజలు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.










