ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు
ప్రజాశక్తి-విజయవాడ: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా చైల్డ్ లైన్ 1098, ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు పాల్గొని తాను బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకినని తొలి సంతకం చేసిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులు, ప్రజలతో బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యం నుండే పిల్లలను పనులకు పంపిస్తూ వారి బాల్యాన్ని చిధిమేస్తున్నారన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బాల్యానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలతో పనిచేయించడం నేరమని, బాలకార్మిక చట్టాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. బాలకార్మికులను ప్రోత్సహించే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాల కార్మికులనుగానీ, బడికివెళ్లని బాలలనుగానీ, ఆపదలో ఉన్న బాలలనుగానీ గమనించిన వారు వెంటనే 100, 101, 181, 1098 నెంబర్లలో దేనికైనా సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి బాల కార్మికులకు విముక్తి కల్పించడం జరుగుతుందన్నారు. బాల కార్మికులను రక్షించి బాల్యానికి భవిష్యత్‌ను అందించడం ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. పారిశ్రామిక వాడలు, హోటల్స్, షాపింగ్ మాల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. బాల కార్మికుల యజమానులపై విధించిన అపరాధ రుసుము ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆయా బాలల ఆరోగ్య సంరక్షణకు, భవిష్యత్ విద్యావసరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మిక చట్టాలపై ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన్నపుడు బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపగలుగుతామన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలను చైతన్యవంతులను చేసి బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజరు, డిఆర్‌ఒ కె.మోహన్‌కుమార్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఆశారాణి, శిశు సంక్షేమ శాఖ పీడీ జి.ఉమాదేవి, డియంహెచ్‌ఒ డాక్టర్ ఎం.సుహసిని, డ్వామా పీడీ జె.సునీత, డిఎస్‌ఒ కోమలిపద్మ, ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా కో-ఆర్డినేటర్ అరవ రమేష్ తదితరులు పాల్గొన్నారు.










