Jan 24,2023 19:42

రాయచోటి : ర్యాలీ ప్రారంభిస్తున్న జెసి తమీమ్‌ అన్సారీయా

ప్రజాశక్తి-రాయచోటి: బాలికల పరిరక్షణ అందరి బాధ్యతని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా అన్నారు. మంగళవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాయచోటి ఏరియా ఆసుపత్రి వద్ద జెసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రి నుంచి నేతాజీ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికా సంరక్షణతో పాటు సాధికారత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ బద్ధంగా బాలికలకు కల్పించిన హక్కులను గౌరవించాలన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. భ్రూణ హత్యల నిరోధాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని వ్యతిరేకించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాలబాలికల మధ్య తేడాలు చూపవద్దన్నారు. చిన్నతనం నుంచే బాలికలకు అవకాశాలు కల్పించినపుడే సమాజంలో మార్పు సాధ్యం అవుతుందన్నారు. ఆడపిల్లలకు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ర్యాలీలో డిఐఒ డాక్టర్‌ ఉషశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ మధుసూదన్‌రెడ్డి, డెమో మీడియా అధికారిని దేవ శిరోమణి, ఎఎన్‌ఎం, ఆశ, బాలికలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కలకడ : స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌బిఎస్‌కె ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శేషగిరి బాబు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ, వైద్యులు డాక్టర్‌ మల్లికార్జున, ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటేష్‌, ఆరోగ్య పర్యవేక్షకులు వెంకటేశ్వర రావు, ఆరోగ్య సిబ్బంది, ఉపాద్యాయులు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి: మండలంలోని కోనంపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులచే భేటీ పడావో బేటి బచావో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కొనంపేట వైద్య అధికారి సిద్దయ్య, హెచ్‌ఎం సుబ్బరాయుడు, సిహెచ్‌ఒ, రవీంద్ర, హెచ్‌ఎ జి.రామచంద్ర, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రైల్వేకోడూరు: పట్టణంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బాలికా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం బాలికలకు ఉండే హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం అంశాలలో పెద్దపీట వేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఐసిడిఎస్‌ కార్యాలయంలో మొక్కలు నాటి, అంగన్వాడీ కార్యకర్తలకు మెడికల్‌ కిట్లను శానిటైజర్‌లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి, జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌ రాజు, జడ్‌పిటిసి రత్నమ్మ, వైస్‌ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి, ఉప సర్పంచ్‌ తోట శివ సాయి, పట్టణ అధ్యక్షులు రమేష్‌, ఎంపిడిఒ నాగార్జున, సిడిపిఒ రాజేశ్వరమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు. పీలేరు: స్థానిక ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌ నాయక్‌, ప్రిన్సిపల్‌ అన్నపూర్ణ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కొండయ్య, పర్యవేక్షకులు కుసుమ, అక్కయ్య, ఉమ, సిహెచ్‌ఒ చంద్రకళ, వెంకటరత్నం, మహిళా పోలీసులు రజని, మీనాక్షి, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.