పులివెందుల టౌన్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9, 10 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని అధికారులందరూ బాధ్యతగా తమకు అప్పగించిన విధులు నిర్వహించాలని కలెక్టర్ విజరురామరాజు పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలోని బాకరాపురం హెలిప్యాడ్, శ్రీకష్ణ దేవాలయం, ఎపి సిఎఆర్‌ఎల్ ఆవరణలోని ఆదిత్య బిర్లా టెక్స్ టైల్స్, వ్యవసాయ, ఉద్యాన కళాశాల, శిల్పారామం ప్రాంగణాలను ఎస్‌పి సిద్దార్థ్ కౌశల్, జెసి గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని, తాగు నీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. భద్రతా, పార్కింగ్ అంశాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాడా ఒఎస్‌డి అనిల్ కుమార్ రెడ్డి, పులివెందుల ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు, జడ్‌పి సిఒఒ సుధాకర్ రెడ్డి, పోలీసు, ఫైర్ అధికారులు, మున్సిపల్, విద్యుత్, ఆర్‌అండ్ బి, పిఆర్ శాఖల ఇంజినీర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.