పెనుకొండ : ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని కలెక్టర్ బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం పెనుగొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కల్పతరువు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్కేయూ వైస్ ఛాన్స్లర్ రామకష్ణారెడ్డి, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలను పెంచడంతోనే మానవ మనుగడ సాధ్యం అవుతుందని తెలిపారు. కళాశాల ఆవరణంలో మొక్కలను పెంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆర్డీటీ సౌజన్యంతో కల్పతరువు కార్యక్రమం ద్వారా 751 వివిధ రకాల మొక్కలను నాటడం అభినందనీయం అన్నారు. ప్రజలు కూడా జన్మదినోత్సవం, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా అవసరమైన ప్రాంతాల్లో మొక్కలను నాటాలన్నారు. శ్రీ సత్యసాయిబాబా 100వ జన్మదినం వేడుకల నిర్వహణ నాటికి పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు కోటి మొక్కలను నాటే కార్యక్రమం లక్ష్యంగా ఉందన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ నేతత్వంలో జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మొక్కలను నాటే విధంగా నిర్ధేశం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు. ఎస్‌కెయు విసి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నీలం రమేష్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపి పీడీ సుదర్శన్, ఎస్‌ఈపి ఆర్.గోపాల్ రెడ్డి, జెడి అగ్రికల్చర్ సుబ్బారావు, ఆర్డీటీ టెక్నికల్ డైరెక్టర్ బీర లింగప్ప, బ్రహ్మకుమారి ఈశ్వరీయ ప్రతినిధులు దిలిప్, ఓం నారాయణ, సిస్టర్ హేమలత, మున్సిపల్ కమిషనర్ వంశీకష్ణ, పెనుగొండ ఎఫ్‌ఎస్‌ఒ మల్లికార్జున, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు ఓబులేసు, రంగనాయకులు పాల్గొన్నారు.










