బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రజాశక్తి-కావలి : కావలి డివిజన్ దగదర్తి మండలం దామవరం గ్రామ అరుంధతీయవాడకు చెందిన అత్యాచారానికి గురైన ఆమెకు బాలికకు ఆర్థిక సహకారం, నీవేశన స్థలం, సాగుభూములను ఇచ్చి, ప్రభుత్వం ఆదుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ మైనంపాటి ఏసురత్నం తదితరులు ఆర్‌డిఒను కోరారు. ఈ మేరకు ఆర్.డి.ఒ. కార్యాలయ డి.ఎ.ఒ. సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ దామవరం గ్రామ వలంటీర్‌గా పని చేస్తున్న కుక్కుమల్లి సందీప్ బాలిక తల్లితో వివాహేతర సంబంధం కలిగి, బాధితురాలిని కిడ్నాప్ చేసి, 14ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయం బాధితురాలి తండ్రి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి తెలిపిన మీదట తాము కావలి డి.ఎస్.పి.కి ఫిర్యాదు చేయగా పోలీసులు స్పందించి, సందీప్‌ను, బాలిక తల్లిని అరెస్ట్ చేశారని తెలిపారు. చిన్న వయసులోనే బాలికపై జరిగిన అఘాయిత్యానికి అధికారులు స్పందించి, ఆమెకు పునరావాసం కల్పించి, ఆమె చదువుకునేలా ఏర్పాట్లు కల్పించి, ఆదుకోవాలని వారు కోరారు.










